మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!
మహారాష్ట్రలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు, డిజిపిలు, సిఈఓలు, ఎక్సైజ్, ఆదాయపు పన్ను, అధికారులతో కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ ఆరోరా, ఇతర ఎన్నికల కమీషన్ అధికారులు డిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సిఈఓ రజత్ కుమార్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, అడిషనల్ డిజి జితేందర్ లతో పాటు ఐటి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని గడ్చిరోలి, నాందెడ్, చంద్రాపూర్, యావత్ మాల్ జిల్లాలతో సరిహద్దు ఉందని, తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలలో 14 చెక్ పోస్టులు ఉన్నాయని, మహారాష్ట్ర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటలు ముందు, కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ ముగిసే వరకు Dry day అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని, ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని 1800 మంది హోమ్ గార్డ్స్ ను విధులకు పంపామని, చెక్ పోస్టులలో CCTVలు ఏర్పాటు చేశామని తెలిపారు.
సిఈఓ రజత్ కుమార్ మాట్లాడుతూ పరిస్ధితులన్ని కంట్రోల్ లో ఉన్నాయని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల కమీషన్ అధికారులకు తెలిపారు.