టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీ: జనసేన
ఏ ఊళ్ళో చూసినా మద్యం ఏరులై పారుతోంది
జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యులు
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలకంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, వారికి అండగా నిలవడమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వెల్లడించారు. జనసేన రాజకీయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. “తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియాలో కోట్లు గడిస్తున్నారని, అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను రూపుమాపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ బాటలోనే నడుస్తోంది. చీకటిపడితే అక్రమ ఇసుక రవాణాకు దారులు తెరుస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవాళ ఏ ఊళ్లో చూసినా మద్యం ఏరులై పారుతోంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం, స్థానిక ఎన్నికలు, ఇసుక, మద్యం పాలసీలపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించాం” అన్నారు.
కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులను ఏ విధంగా రోడ్డున పడేశారో.. ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక ఉద్యోగులను అలాగే రోడ్డున పడేశారు. ఐదేళ్లుగా సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒక్క కలం పోటుతో తొలగించడం అనైతికం. కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, దశల వారిగా వారిని పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్వూహాలపై కమిటీలో చర్చించాం” అన్నారు.
ఎ. భరత్ భూషణ్ మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ వల్ల నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. 5 నెలలుగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. ఇసుక అందుబాటులో లేక రియల్ ఎస్టేట్ , సిమెంటు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రవాణా పరిశ్రమపై ఇసుక కొరత తీవ్ర ప్రభావం చూపింది. ఒకే ఒక్క సంతకంతో లక్షలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించాలి తప్ప .. పాతవారిని తీసేసి కొత్త వారికి ఇవ్వడం సబబు కాదు”అన్నారు.
పాలవలస యశస్విని మాట్లాడుతూ.. “కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుపై ఇచ్చిన హామీ అమలులో జాప్యం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, ఇసుక విధానం అమలులో ప్రభుత్వ వైఫల్యం, ఉపాధి కోల్పోయిన కార్మికుల స్థితిపై సుమారు 3 గంటల పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించాం. ప్రభుత్వ విధానాలను నిలదీయడంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు.
వైసీపీ నాయకులు సిండికేట్ గా ఏర్పడి లిక్కర్ మాఫియాను కొనసాగిస్తున్నారు. వాళ్ల ఇళ్లనే బ్రాందీషాపులుగా మార్చేస్తున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన ముఖ్యమంత్రి గారు.. గ్రామాల్లో లిక్కర్ ను ఏరులై పారిస్తున్నారు. టీడీపీకి జన్మభూమి కమిటీ ఎలాగో .. వైసీపీకి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అటువంటిదే. ప్రభుత్వాలు మారినా ప్రజల బతుకులు మారడం లేదని” అన్నారు.
డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ... “ఇసుక విధానం కారణంగా రోజు కూలీలు రోడ్డున పడడమే కాకుండా, నిర్మాణ అనుబంధ రంగాలన్నీ కుదేలయ్యాయి. దశలవారీగా మద్య నిషేధం అన్న జగన్ రెడ్డి గారు ధర పెంచి దాన్ని కూడా ఓ మాఫియాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని భావించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు చుక్కెదురైంది. రాజు అంటే రాజ్యం అంతటికీ రాజుగానీ మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాజు కాదన్న విషయం జగన్ రెడ్డిగారు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ తరఫున మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు” అని తెలిపారు.
చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “వైసిపి ప్రభుత్వం అవగాహనారాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పి.ఎ.సి.లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇసుక నుంచి లిక్కర్ పాలసీ వరకు అన్నీ వైసిపి కార్యకర్తల జేబులు నింపేవిగా ఉన్నాయి. అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా పార్టీ కార్యచరణకు రూపకల్పన చేయడం జరిగింది. దీంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అంశం మీద, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైనా చర్చించాం” అని తెలిపారు.
కోన తాతారావు మాట్లాడుతూ... “ప్రకృతి సంపద అయిన ఇసుకను వైసిపి ప్రభుత్వం సాధారణ ప్రజలకు అందని ద్రాక్షగా మార్చింది. టిడిపి ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహించి తమ కార్యకర్తలను కోటీశ్వరుల్ని చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో ఇసుక ద్వారా తమ పార్టీ జెండాలు మోసిన వారికి ఉపాధి కల్పించాలని చూస్తోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పాలన వలసలను మరింత ప్రోత్సహించే విధంగా ఉంది” అన్నారు.