పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం అని ఉంటే ఆత్మహత్యగా నమోదు చేస్తారా?.. పవన్ కల్యాణ్ ఆగ్రహం
* కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ ఘటనపై సమగ్ర విచారణ చేయిచండి
* జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2017 ఆగస్ట్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. పలుమార్లు అత్యాచార చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైతే.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యాచారం చేయబడి హత్యకు గురైన మైనర్ బాలిక తల్లిదండ్రులు పార్వతి, సుగాలి రాజు నాయక్ బుధవారం సాయంత్రం మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ కలిసి తమ గోడు వెళ్లగక్కారు.
"మా కుమారైను పలుమార్లు అత్యాచారం చేసి హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దుర్ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా గత ప్రభుత్వంగానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. నిందితులతో కుమ్మకై కాంప్రమైజ్ కావాలని స్థానిక రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్వ్యాడ్ లను పిలవకుండానే విచారణ పూర్తి చేశారు. తాడుతో గొంతు నులిమి చంపి.. చీరతో ఉరేసుకుందని కేసును క్లోజ్ చేశారు. మేము న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు.
తప్పు చేసిన వారు ఏసీ కారుల్లో తిరుగుతుంటే మేము మాత్రం రోడ్లపై న్యాయం కోసం పోరాడుతున్నాం. అత్యంత కిరాతంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకు శిక్షపడితే మరో ఆడపిల్లకు అన్యాయం జరగదనే ఉద్దేశంతోనే పోరాడుతున్నామ"ని పార్వతి, రాజు నాయక్ కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి గోడు విన్న పవన్ కల్యాణ్ చలించిపోయారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేసును సమగ్రంగా విచారించి నిందితులకు శిక్షపడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. బిడ్డను కోల్పోయిన దంపతులకు న్యాయం చేయాలన్నారు. న్యాయం జరగని పక్షంలో వ్యక్తిగతంగా హ్యుమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.