ఇకపై రవాణాశాఖ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!
హైదరాబాద్: రాష్ట్రంలో మెరుగైన పౌర సేవలను ప్రజలకు మరింత పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో మరిన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించే సదుపాయాన్ని విస్తరించింది. పారదర్శకంగా వినియోగదారులకు సేవలందించేందుకు, కార్యాలయం ద్వారా జరిగే అన్నిరకాల సర్వీసులన్నీ ఆన్‌లైన్‌లోనే ఇకనుండి జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల అదనంగా 17 రకాల సేవలను ఆన్లైన్ పద్దతిలో ప్రారంభించారు. దీనితో, మొత్తం 59 పౌర సేవలకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే నిబంధనతో ఆధునీకరించారు. ప్రతీ సర్వీసుకు స్లాట్ విధానం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 33,000 లావాదేవీలు జరుగుతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్ల జారీ, పన్ను వసూలు, వాహనాల రోడ్డు నిబంధనల ఉల్లంఘనలు, రోడ్డు భద్రతను ప్రోత్సహించడంలో రవాణా శాఖ ప్రముఖ పాత్ర వహిస్తోంది. ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించింది. జూలై 21 తేది వరకు రాష్రంలో రిజిస్ట్రేషన్లు పొందిన వాహనాల సంఖ్య 1.47 కోట్లు. ఇప్పటివరకు వాటిపై ప్రభుత్వానికి సేవల రూపేణా వచ్చిన ఆదాయం రూ.1615 కోట్లు. గత సంవత్సరం వచ్చిన ఆదాయం రూ.868 కోట్లు మాత్రమే. రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల జారీ, మోటారు వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్లు తదితర సేవలపై ఆదాయాన్ని సేకరిస్తుంది.
సేవలు అందించడంలో పారదర్శకతను మరింత పెంచడానికి, రవాణా శాఖలో “ఎనీవేర్ ఎనీటైమ్ ఆన్‌లైన్ సర్వీసెస్” అనే ప్రాజెక్ట్ ద్వారా m-గవర్నెన్స్ పై మరింత ఆధారపడాలని డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. నిర్దిష్ట RTA సేవలను పొందాలనుకునే పౌరులు RTO కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు.
RTA అప్లికేషన్ T-యాప్ ఫోలియోతో అనుసంధానించబడింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన అధికారిక మొబైల్ యాప్. సిటిజన్ సర్వీసెస్ కోసం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) ఆధారిత లైవ్‌నెస్ డిటెక్షన్ స్మార్ట్ ఫోన్ ద్వారా అందిన ఫోటో సరైనదా, కాదా, అని తనిఖీ చేస్తుంది. అతని పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మరియు చిరునామా వంటి డెమోగ్రాఫిక్ లక్షణాలను తనిఖీ చేయడానికి మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఎంటిటీ రిజల్యూషన్ ను కూడా ఏర్పాటు చేశారు.
వాహనదారుల ఛాయాచిత్రాలను పోల్చడానికి డీప్ లెర్నింగ్ ఆధారిత ఫోటోగ్రాఫిక్ విధానం కూడా ప్రారంభించారు. అందులో మొత్తం 17 రకాల సేవలు ఉన్నాయి. ఎనీవేర్ ఎనీటైమ్ ఆన్‌లైన్ సేవల కింద ఇప్పటివరకు 1,13,115 లావాదేవీలు నమోదయ్యాయి. ఈ విధానంలో డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ జారీ, డూప్లికేట్ లైసెన్స్ జారీ, బ్యాడ్జ్ జారీ, ఇప్పటికే ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సరెండర్‌కు బదులుగా స్మార్ట్ కార్డ్ జారీ, లైసెన్స్ హిస్టరీ షీట్ జారీ, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, డ్రైవింగ్ లైసెన్స్ లో చిరునామా మార్పు, ప్రమాదకర రసాయనాలు మరియు వస్తువుల రవాణకై ప్రత్యేక లైసెన్సుల ఆమోదం, గడువు ముగిసిన లెర్నర్ లైసెన్స్ స్థానంలో కొత్త లెర్నర్ లైసెన్స్, వాహనం యొక్క తరగతికి అదనంగా లెర్నర్ లైసెన్స్, గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం లెర్నర్ లైసెన్స్ జారీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో చిరునామా మార్పు, తెలంగాణ రాష్ట్ర పరిదిలో క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ, కొత్త పర్మిట్ జారీ, డూప్లికేట్ పర్మిట్ జారీ, పర్మిట్ పునరుద్ధరణ, తాత్కాలిక/ప్రత్యేక అనుమతి జారీ తదితర అంశాలు ఈ ఆన్ లైన్ విధానంలో ఏర్పాటు చేశారు.