హెపటైటిస్‌తో తస్మాత్ జాగ్రత్త
- నీరు, ఆహారం ద్వారా వ్యాపించే హెపటైటిస్ E వైరస్ ప్రమాదకరం
- హెపటైటిస్ ఏ, బీ, సీ ఈలకు తక్షణ చికిత్స అవసరం
- టీకాలతో కొన్నింటి నుంచి రక్షణ
- జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే
కలుషిత నీరు, ఆహార పానీయాల ద్వారా సంక్రమించే వైరస్‌లు.. హెపటైటిస్ ఏ, ఈ:
ఈ రకం వైరస్‌లు సోకినప్పుడు ముందుగా జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం, ఆకలి తగ్గడం, వాంతుల వంటి లక్షణాలతో మొదలై చివరకు కామెర్లకు దారితీస్తుంది. పిల్లలలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉండి, త్వరగా కోలుకుంటారు. పెద్దలలో మాత్రం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాళ్లు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు చాలామందికి మందులు అవసరం లేకుండానే తగ్గిపోతాయి. కొద్దిమందిలో మాత్రం లివర్ ఫెయిల్యూర్లకు ఇది దారితీస్తుంది. ఈ రకం వైరస్‌ల వల్ల లివర్ సిరోసిస్ రాదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ రకం కామెర్లు వచ్చినప్పుడు లంకణాలు చేయడం, మంత్రాలు వేయించడం, నాటు మందులు వాడటం మంచిది కాదు. అలాంటి పద్ధతుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. మరింత హానికలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకు మాత్రమే చూపించుకోవాలి.
హెపటైటిస్ ఎ:
వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ వైరస్ ప్రబలుతుంది. హాస్టళ్లలాంటి సామూహికంగా ఉండే ప్రాంతాల్లో పిల్లలకు ఈ వ్యాధి వస్తుంది. పెద్దవాళ్లకు ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారికి వ్యాధి లక్షణాలు తగ్గడానికి 6 నెలల వరకు సమయం పట్టచ్చు. అప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారిలో లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. ఈ వ్యాధి నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
హెపటైటిస్ ఈ: వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా హెపటైటిస్-ఈ సంక్రమిస్తుంది. వర్షరుతువులో, వరదలు, జాతరలు, తిరునాళ్లలో ఈ వ్యాధి ప్రబలుతుంది. చాలామందికి ఈ రకం హెపటైటిస్ ఎలాంటి సమస్య లేకుండానే తగ్గిపోతుంది. అతి కొద్దిమందిలో.. అంటే ముఖ్యంగా గర్భిణులు, అప్పటికే లివర్ సమస్య ఉన్నవారిలో మాత్రం ఇది ప్రాణాంతకం కావచ్చు. దీన్ని నిరోధించడానికి ఇంతవరకు టీకాలు ఏవీ అందుబాటులోకి రాలేదు.
రక్తం, శరీర ద్రవాల ద్వారా సంక్రమించే వైరస్‌లు:
హెపటైటిస్ బీ & హెపటైటిస్ సీ:
ఈ రెండు వైరస్‌లు ప్రధానంగా రక్తం, ఇతర శరీర స్రావాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. రక్తదానం, అరక్షిత శృంగారం, సరైన పద్ధతిలో శుద్ధిచేయని శస్త్రచికిత్స పరికరాలు, సూదుల ద్వారా మత్తుమందులు/మాదకద్రవ్యాలు తీసుకోవడం, ప్రసవ సమయంలో తల్లినుంచి బిడ్డకు ఇవి వస్తాయి. ఈ వైరస్ వచ్చిన చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు వీరికి శరీరంలో వైరస్ ఉన్నట్లే తెలియదు. సాధారణ వైద్య పరీక్షలు లేదా రక్తదానం చేసేటప్పుడు చేసే స్క్రీనింగ్‌లో ఇది బయటపడుతుంది. మరికొందరికి దీర్ఘకాల కాలేయ వ్యాధి బయటపడినప్పుడు తెలుస్తుంది. ఈ రకం వైరస్‌లు దీర్ఘకాలం పాటు శరీరంలో ఉండిపోతాయి. కొద్దిమందిలో మాత్రం రెండు, మూడు దశాబ్దాల తర్వాత సిరోసిస్ లేదా లివర్ కేన్సర్ సంభవించవచ్చు.
చికిత్స, నివారణ: హెపటైటిస్-బీ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. మందులతో శరీరంలో వైరస్ ఉనికిని కట్టడి చేయవచ్చు. హెపటైటిస్ బీ రాకుండా నివారించడానికి టీకాలు ఉన్నాయి. అందువల్ల వ్యాధి లేనివారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. హెపటైటిస్ సీ రాకుండా నిరోధించే టీకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోగానే పూర్తిగా నిర్మూలించడానికి మందులు అందుబాటులోకి వచ్చాయి.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రతి ఒక్కరూ హెపటైటిస్ పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటివరకు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ లేనివారు తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. పుట్టిన పిల్లలకు వెంటనే టీకా వేయించాలి. ఒకవేళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే, చికిత్స తీసుకోవడానికి వేచి ఉండకూడదు.