కృష్ణా, గోదావరి నదులకు ఎదురవుతున్న సవాళ్ల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: రాజేశ్వర్ తివారి

Related image

జీవ నదులైన కృష్ణా, గోదావరిలను పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్ల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి అన్నారు. తెలంగాణ ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ రెండు నదుల నిరంతర ప్రవాహం అత్యంత అవరసమని ఆయన వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ బయో డైవర్సిటి (IFB) ఆధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదులు, పరివాహక ప్రాంతాల ప్రక్షాళనపై హైదరాబాద్ లో వర్క్ షాప్ జరిగింది. 

గంగానది ప్రక్షాళనకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా తొమ్మిది బేసిన్లలో 13 నదుల ప్రక్షాళన పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. (బియాస్, చినాబ్, జీలం, రావి, సట్లెజ్, యమున, బ్రహ్మాపుత్ర, మహానది, నర్మద, కృష్ణా, గోదావరి, కావేరి, లూని నదులు) తెలుగు రాష్ట్రాలలో ప్రవహించే కృష్ణ,గోదావరి నదులకు ఈ ప్రాజెక్టులో స్థానం దక్కింది. ఈ రెండు నదుల ప్రస్తుత స్థితి, పరివాహాక ప్రాంత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల పాత్ర, ప్రక్షాళనకు అవసరమైన ప్రాజెక్టు రిపోర్టు తయారీపై సమావేశంలో చర్చ జరిగింది. నదుల ప్రక్షాళనలో అటవీ శాఖతో పాటు వ్యవసాయ, సాగునీటి శాఖ ఇతర సంబంధిత శాఖల పాత్రపై వర్క్ షాప్ లో పాల్గొన్న అధికారుల బృందం చర్చించింది.

జీవ నదులుగా పేరొంది, ప్రకృతి సమతుల్యత, జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన కృష్ణా, గోదావరి బేసిన్లు కాలక్రమంలో వాటి అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయని అధికారులు అభిప్రాయపడ్డారు. అవసరానికి మించి నదులపై ఆధారపడటం, నదీ తీరాల వెంట మానవ, పారిశ్రామిక ఆవాసాలు, ఆక్రమణలు తద్వారా క్షీణిస్తున్న అడవులు, నదుల ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు.  కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నేతృత్వంలో పదమూడు నదుల పునరుజ్జీవానికి ప్రతిపాదనలు సిద్దమౌతున్నాయని,  కృష్ణా, గోదావరి నదుల ప్రక్షాళనకు ఇది మంచి అవకాశమని  ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంస్థ డైరెక్టర్ డి. జయప్రసాద్ తెలిపారు.

ఈ సంస్థ గోదావరి నది పునరుజ్జీవానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేస్తోంది. దానిలో భాగంగా అటవీ శాఖతో పాటు భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నివేదికను సిద్దం చేస్తామని డైరెక్టర్ వర్క్ షాపులో వెల్లడించారు.  ఇనిస్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ (బెంగుళూరు) కృష్ణా నది పునరుజ్జీవన కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మదన్ ప్రసాద్ సింగ్ వెల్లడించారు.  నదుల ప్రక్షాళన, పర్యావరణ సమతుల్యత కోసం తెలంగాణ అటవీ శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని, ఈ రెండు నదుల పునరుజ్జీవన పనులకు అటవీ శాఖ తరపున అదనపు పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు.

పెద్ద నదులకు రెండు వైపులా ఐదు కిలోమీటర్ల మేర, ఉప నదులకు రెండు వైపులా రెండు కిలో మీటర్లమేర జీవావరణం కాపాడుకోవాలని, అందుకు తగిన విధంగా చెట్లు నాటడం, నదీ తీరం వెంట మట్టి కోతను నియంత్రించటం, అనుమతిని మించి ఇసుక తవ్వకాలపై కఠినంగా ఉండాలనే విషయాలపై సమావేశంలో చర్చ జరగింది. నదుల ప్రవాహానికి అడవుల ప్రాధాన్యత అత్యంత అవసరమని, పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అటవీ, జంతు, వన్య సంపదను కాపాడుకునేలా చర్యలు ఉండాలని నిర్ణయించారు. కేంద్ర పర్యావరణ శాఖ నిర్దేశించిన నదులు, ఉప నదుల వెంట దట్టమైన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనం (అనంత్ వన్), జీవనదులుగా పేరొందిన వాటిల్లో నిరంతర ప్రవాహం ఉండేలా చర్యలు (అవిరల్ ధార), స్వచ్చమైన నీటి వనరులను కాపాడుకోవటమే లక్ష్యంగా (నిర్మల్ ధార) కలిసి పనిచేయాలని రాజేశ్వర్ తివారి వెల్లడించారు. ఈ వర్క్ షాపులో చర్చించిన విషయాలు, వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా రెండు నదుల ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు వెల్లడించారు.

వర్క్ షాపులో అటవీ, పర్యావరణ శాఖ, వ్యవసాయ, సాగునీటి శాఖల అధికారులతో పాటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధులు, పిసిబి మెంబర్  సెక్రటరి అనిల్ కుమార్, ఇటిపిఆర్ఐ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవరి, పీసీసీఎఫ్ (అడ్మిషన్) మునీంద్ర, అదనపు పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, నదీ పరివాహక ప్రాంత జిల్లాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases