రైతులకు తక్షణం బకాయిలు చెల్లించాలి.. విత్తనాలు అందించాలి: పవన్ కల్యాణ్
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి సొమ్ములు చెల్లించడంలో జాప్యం చేయడం దురదృష్టకరం. తొలకరి సమయంలో వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. బకాయిలు చెల్లించకుండా, రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జనసేన నాయకుల ద్వారా రైతు ప్రతినిధులు నన్ను కలిసినప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బాకీలు, విత్తనాల కోసం పడుతున్న బాధలను వివరించారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను తక్షణం విడుదల చేసి, విత్తనాలను తగినంతగా అందుబాటులో ఉంచాలి. ఈ రోజు నాటికి రూ. 610.86 కోట్లు రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ.240 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.176 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.94 కోట్లు ప్రభుత్వం బాకీపడింది. ఖరీఫ్ పనులు మొదలైన తరుణంలో ధాన్యం అమ్మిన సొమ్ము రాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రైతులు విత్తనాల కొరతతో ఎన్నో ఇబ్బందులుపడుతున్నారు. విత్తనాల కోసం అర్థరాత్రి వరకూ క్యూల్లో నిలబడ్డా దొరుకుతాయో లేవో తెలియని పరిస్థితి ఉండటంతో రైతాంగం బాధపడుతోంది. అనంతపురం జిల్లాలో ఈ యేడాది 4.96 లక్షల హెక్టార్లలో వేరుశెనగ వేస్తారని, ఇందుకు 3 లక్షల క్వింటాళ్ళ విత్తనం అవసరమని అంచనా వేశారు. కానీ 1.8 లక్షల క్వింటాళ్ళు విత్తనమే వచ్చిందనీ, ప్రభుత్వం ఇచ్చే చోట విత్తనం దొరకడం లేదనీ బయట వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశెనగ విత్తనం దొరుకుతోందని రైతులు చెబుతున్నారంటే లోపం ఎక్కడ ఉందో ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే విత్తనాలను రైతులు బయట అమ్ముకొంటున్నారనీ, అలా చేస్తే ప్రభుత్వ లబ్ధి రాదు అంటూ అధికారులు హెచ్చరించడం సరికాదు. ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పరిస్థితిపై సమీక్షించాలి. రైతులకు బకాయిల చెల్లింపు, విత్తనాల కొరత తీర్చడంపై దృష్టిపెట్టాలి. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొనేలా చేయాలి.