"ఫుట్ బాల్ పరిమాణం"లో ఉన్న మూత్రపిండాల కణితిని విజయవంతంగా తొలగించిన ఎ.ఐ.ఎన్.యు వైద్యులు
* 10 కిలోల బరువున్న మూత్రపిండాల కణితిని విజయవంతంగా తొలగించడం ఇది దేశంలోనే రెండోసారి
హైదరాబాద్, నవంబర్ 17, 2022: ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎ.ఐ.ఎన్.యు.) వైద్యులు మూత్రపిండాల్లో 10 కిలోల బరువున్న 'ఫుట్ బాల్ సైజు' కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ శస్త్రచికిత్స తెలుగు రాష్ట్రాల్లో నమోదైన మొట్టమొదటిది, దేశంలో రెండోది మాత్రమే. డాక్టర్ సి.మల్లికార్జున నేతృత్వంలో డాక్టర్ తైఫ్ బెండిగెరి, డాక్టర్ కె.రాజేష్ రెడ్డిలతో కూడిన యూరాలజిస్టుల బృందం ఈ సంక్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది.
కడపకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి పొత్తికడుపులో వాపు ఉండటంతో వాపుతో ఆయనను ఎ.ఐ.ఎన్.యు.కు తరలించారు. పరీక్షించిన తరువాత, పొత్తికడుపులో ఏదో పెద్ద కణితి, గాయం ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. ఎడమ మూత్రపిండాల నుంచి ఆ కణితి వచ్చినట్లు ఇమేజింగ్ వల్ల తెలిసింది. ఆ కణితి ఎంత పెద్దదంటే, అది పొత్తికడుపు కుహరంలో మూడింట రెండు వంతుల భాగాన్ని ఆక్రమించింది. దీనివల్ల పేగులు కుడి దిగువ భాగంలోకి వెళ్లిపోయాయి.
రోగి పరిస్థితి, కేసులోని సంక్లిష్టత, అతడికి అందించిన చికిత్సపై ప్రఖ్యాత కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, "కణితి పరిమాణం దృష్ట్యా, మేము రోబోటిక్ ప్రక్రియ వద్దని నిర్ణయించుకున్నాము. దానికి బదులుగా ఓపెన్ శస్త్రచికిత్సను ఎంచుకున్నాము. చాలా కష్టపడిన తర్వాత కణితిని విజయవంతంగా తొలగించగలిగాము. శస్త్రచికిత్స అనంతరం, కణితి ఏకంగా ఫుట్ బాల్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉందని తెలిసింది. మైక్రోస్కోపిక్ పరీక్ష ద్వారా, ఇది క్యాన్సర్ (రీనల్ సెల్ కార్సినోమా) అని ఖరారైంది’’ అని తెలిపారు.
"పొత్తికడుపులో వాపు ఉంది. కానీ, రోగి దాన్ని గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. లేదా నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. మా బృందం క్యాన్సర్ ప్రభావిత ఎడమ మూత్రపిండాన్ని తొలగించింది. కణితి పూర్తిగా తొలగిపోయిందన్న విషయం మైక్రోస్కోపిక్ సర్జికల్ మార్జిన్లతో స్పష్టమైంది. అదృష్టవశాత్తూ, కణితి మరే ఇతర అవయవాలకు వ్యాపించలేదు కాబట్టి, రోగికి ఎటువంటి అదనపు చికిత్స అవసరం లేదని నిర్ధారించాము. ఫాలోఅప్ చికిత్సలు, పరీక్షలను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అతనిని హెచ్చరించాము. ఇది క్రమం తప్పకుండా ఆయన్ను పర్యవేక్షించడానికి సహాయపడుతుంది" అని శస్త్రచికిత్సలో పాల్గొన్న యూరాలజిస్టులు డాక్టర్ కె. రాజేష్ రెడ్డి, డాక్టర్ తైఫ్ బెండిగెరి వివరించారు.
ఈ సందర్భంగా, ఎ.ఐ.ఎన్.యు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి ప్రతి ఒక్కరికీ అవసరమైన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా యూరోలాజికల్ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎ.ఐ.ఎన్.యు. క్రమం తప్పకుండా యూరోలాజికల్ క్యాన్సర్ కణితులకు శస్త్రచికిత్సలు చేస్తుంది. ఆసుపత్రిలో సర్జికల్ రోబో, లాపరోస్కోపీ ఉన్నాయి. దీనివల్ల కీ హోల్స్ ద్వారా శస్త్రచికిత్స సులభతరం అవుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఉన్నట్లు కాకుండా, ప్రారంభ దశలోనే రోగనిర్ధారణ అయితే, పాక్షిక నెఫ్రెక్టమీ (మూత్రపిండాల ఆరోగ్యకరమైన భాగాన్ని తీసేయకుండా కణితిని తొలగించడం) కీ-హోల్ శస్త్రచికిత్స ద్వారా నిర్వహించవచ్చు’’ అని డాక్టర్ రెడ్డి తెలిపారు.