డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ!
అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు
రైతు బంధు, రైతు భీమా పథకాలు, రైతులకు వరం
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం భైంసా పట్టణం కమలాపురం గుట్ట సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టిందన్నారు. అన్ని వసతులతో ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షలతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. రైతు బంధు, రైతు భీమా, కాళేశ్వరం ప్రాజెక్ట్.. రైతులకు వరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు.
పంట కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గడ్డన్న వాగుకు నీటి కొరత లేకుండా చూడాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇటీవలే సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారని, దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
గతంలో ముధోల్ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉండేదని.. స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో నేడు అభివృద్ది పథంలో దూసుకుపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.