ఈనెల 18 నుండి “కంటి వెలుగు” ప్రారంభం.... ఈ కార్యక్రమానికై 200 కోట్లు మంజూరు
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం ... “అందత్వ రహిత తెలంగాణ” …
ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ..
ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు....
వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు....
పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖలతో వైద్య ఆరోగ్య శాఖ సమన్వయం ...
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా కార్యాచరణ ...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈనెల 18 నుండి రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకై ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరు ప్రజాప్రతినిధులు పాల్గోనేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్రతినిదులందరికీ ఇందులో భాగస్వామ్యం కావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారిచేసింది.
ప్రపంచంలోనే నిర్దేశిత కాలంలో భారీ సంఖ్యలో కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా, మొదటి దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతం చేసింది. ఆ కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ జరిగింది. ఇదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుంది. రాష్ట్రంలో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షలతో పాటు మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వనున్నారు. జిల్లాల్లో ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీచేసారు. గతంలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలపాటు నిర్వహించారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో ఎక్కువ వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ధఫా కార్యక్రమంలో 827 బృందాలు పాల్గొన్నాయి. రెండవ ధఫా కార్యక్రమంలో 1500 బృందాలనుఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంపుల నిర్వహణ ఉంటుంది. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్ఆ ధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, లు, ముగ్గురు ఆశా వర్కర్లు, ఒక కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయనున్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని అధికారుల తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేస్తున్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోపే ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం కావడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావాడానికి అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటి వెలుగు సమావేశాలు నిర్వహిస్తున్నారు అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్ లోనూ సమావేశాలు నిర్వహిస్తూ షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రేషన్ షాపుల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంప్స్ నిర్వహణ తేదీలు అందరికి తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ, సమస్యలు తలెత్తకుండా ప్రణాళికను రూపొందించటానికి అధికారులు కృషి చేస్తున్నారు. అదనపు బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తేదిలలో కంటి పరీక్షలు చేయించుకోలేనివారి కోసం కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలనే ప్రభుత్వం కొత్తగా 929 వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో నియమించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
_______________________________________________________________
శ్రీయుత కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.