వినికిడి సమస్య ఉన్న చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు; ముఖ్య అతిధిగా హీరో నాగ చైతన్య
• ముఖ్య అతిధిగా హీరో నాగ చైతన్య
* ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది బాధితులు
* కాక్లియర్ ఇంప్లాంట్ల అమరికే సరైన పరిష్కారం
హైదరాబాద్, జనవరి 8, 2023: ప్రపంచ జనాభాలో 6% మంది.. అంటే దాదాపు 43 కోట్ల మంది పాక్షికంగా, లేదా పూర్తిగా వినికిడి సమస్యతో బాధపడుతున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 70 కోట్లకు చేరుకుంటుందని అంటున్నారు!!
శిశువు జన్మించినప్పుడే ఏమీ వినపడకపోతుంటే దాన్ని జన్మతః వచ్చిన వినికిడిలోపం అంటారు. అది వాళ్లకు మాటలు రావడం, భాషాపరమైన అభివృద్ధిపైనా ప్రభావం చూపుతుంది. దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, తగిన చికిత్స చేయించాలి. పుట్టే ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు నలుగురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటుంటే, ఆరేడుగురికి మాత్రం కొద్దిపాటి సమస్య ఉంటోంది. సాధారణంగా వినికిడి 90% లేదా అంతకంటే ఎక్కువ దెబ్బతింటే “కాక్లియర్ ఇంప్లాంట్” పెట్టించడమే ఉత్తమ చికిత్స. ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దీనివల్ల చెవుడు ఉన్నవారు, లేదా తీవ్రమైన వినికిడి లోపం ఉన్నవారికి శబ్దాలు వినపడతాయి.
భారతదేశంలో ప్రతియేటా దాదాపు లక్ష మందికి పైగా పిల్లలు తీవ్రమైన వినికిడి లోపంతో పుడుతున్నారు. దాదాపుగా వీరందరికీ వారి మాట, భాషానైపుణ్యాలు మెరుగుపడాలంటే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేయించాలి. కానీ, మన దేశంలో మాత్రం ఇప్పటివరకు సుమారు 35వేల నుంచి 40 వేల వరకు మాత్రమే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు జరిగాయి. ఏడాదికి దాదాపు 5వేల మంది మాత్రమే ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. అంటే మొత్తం బాధితుల్లో 5%కు మాత్రమే సరైన చికిత్స అందుతోంది. మిగిలినవారికి తగిన అవగాహన లేకపోవడం, లేదా డబ్బుల సమస్య వల్ల చేయించుకోవట్లేదు.
కిమ్స్ ఆస్పత్రి ఒక మాదిరి నుంచి తీవ్రమైన వినికిడి సమస్య ఉన్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల కింద కాక్లియర్ ఇంప్లాంట్లు అందిస్తోంది. 2021-22 సంవత్సరంలో కిమ్స్ ఆస్పత్రిలో దాదాపు 150 కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేశారు. వీటిలో చాలావరకు రెండు చెవులకూ చేసినవీ ఉన్నాయి. వినికిడి సమస్యను త్వరగా గుర్తించడం, దానికి త్వరగా చికిత్స చేయించడంపై అవగాహన మరింత పెంచేందుకు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం “కాక్లియర్ ఇంప్లాంట్ గ్రహీతల సమావేశం” నిర్వహించారు. ఇందులో కాక్లియర్ ఇంప్లాట్ చేయించుకున్న వారిలో పలువురు ఒక చోట చేరి, ఆట పాటలు, డాన్స్ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలూ చేపట్టారు. ప్రముఖ సినీనటుడు నాగచైతన్య దీనికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఉత్సహాపరిచారు. ఈ కార్యకమంలో కిమ్స్ ఆస్పత్రి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బి.భాస్కరరావు, ఈ ఎన్ టీ విభాగ అధిపతి డాక్టర్ జనర్థాన్ రావు, ఆడియాలజిస్ట్ శివప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.