నడివయసు వ్యక్తికి దీర్ఘకాలంగా సైనస్‌తో ఇబ్బంది
* సంక్లిష్ట శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన అమోర్ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్, మార్చి 28, 2023: నగరంలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రిలో ఓ నడివయసు వ్యక్తికి దీర్ఘకాలంగా ఉన్న సైనస్ నుంచి విముక్తి కలిగించేందుకు సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఫంక్షనల్ ఎండోస్కొపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) అనే ఈ ప్రక్రియ అత్యంత సంక్లిష్టమైనది. అత్యాధునిక, సాంకేతికంగా అత్యున్నతమైన సర్జికల్ నేవిగేషన్ సిస్టంను ఉపయోగించి ఈ శస్త్రచికిత్సను చేశారు. దీనివల్ల వైద్య బృందం తల లోపల ఉన్న కీలకమైన భాగాలను చూస్తూ, ఎథ్మాయిడ్ సైనసైటిస్‌ను సరిచేశారు.
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌కు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అవుతోందన్న అనుమానంతో అతడిని అమోర్ ఆస్పత్రికి పంపారు. దీనికి అత్యాధునిక పరికరాలతో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అమోర్ ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు, సహాయక సిబ్బందితో పాటు సరైన పరికరాలు ఉండటంతో ఈ సమస్యాత్మక ప్రక్రియను అందుబాటు ధరలో చేసేందుకు ముందుకొచ్చారు.
ఈ ప్రక్రియకు నేతృత్వం వహించిన అమోర్ ఆస్పత్రికి చెందన కన్సల్టెంట్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ దీని గురించి మాట్లాడుతూ, “46 ఏళ్ల వయసున్న ఈ రోగి ఎథ్మాయిడ్ సైనసైటిస్‌తో బాధపడుతున్నారు. దీన్ని అలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఎందుకంటే ఆయనకు సైనస్‌లు కళ్లకు, పుర్రెకు సమీపంలో ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్లి, ఇన్ఫెక్షన్ సోకిన పలు పొరలను తొలగించడానికి అమోర్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక పరికరాలను వినియోగించాం. సర్జికల్ నేవిగేషన్ సిస్టం ఉండటం వల్ల వైద్యులు సరైన ప్రదేశానికి చేరుకుని, ప్రభావిత కణజాలాలను తొలగించడం సాధ్యమైంది. ఇలా శస్త్రచికిత్స చేసే సమయంలో మిగిలిన కీలక భాగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోగలిగాం. ఎందుకంటే అక్కడే కంటి నరం, స్కల్ బేస్ లాంటి భాగాలతో పాటు ముఖ్యమైన కణజాలాలు కూడా ఉంటాయి. అవేవీ దెబ్బతినకుండా శస్త్రచికిత్స పూర్తిచేశాం” అని తెలిపారు.
“ఫంక్షనల్ ఎండోస్కొపిక్ సైనస్ సర్జరీ (ఫెస్) అనేది ఆటోలారింగాలజిస్టులకు చాలా సవాలుతో కూడుకున్న శస్త్రచికిత్స. దీర్ఘకాలంగా ఉన్న సైనసైటిస్‌కు శస్త్రచికిత్స చేయడానికి, ముక్కులోని పాలీప్‌లను తొలగించడానికి, శ్వాసమార్గాలను తెరవడానికి, ఇంకా ఏ రకమైన స్కల్ బేస్ శస్త్రచికిత్సలకైనా ఇదే కీలకం. ముఖ్యంగా ఈ కేసులో, శస్త్రచికిత్స చేసిన రెండు రోజుల తర్వాత వరకు రోగిని నిరంతరం పర్యవేక్షణలో ఉంచాం. ఎలాంటి సమస్య లేకపోవడంతో ఒకసారి సమీక్షించి, డిశ్చార్జి చేశాం” అని ఆయన వివరించారు.