హైదరాబాద్, ఏప్రిల్ 16, 2023: మనం ముక్కుద్వారా పీల్చుకునే ఊపిరి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆ శ్వాసనాళంలో ఏదైనా చిన్న అన్నం మెతుకు అడ్డుపడితేనే మనకు పొలమారి, దగ్గు వచ్చి, తీవ్రంగా ఇబ్బంది పడతాం. అలాంటిది దాదాపుగా శ్వాసనాళం మొత్తాన్ని ఒక కణితి ఆక్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? నిజామాబాద్‌కు చెందిన 58 ఏళ్ల వయసుండి, గతంలో ఎలాంటి అనారోగ్యాలూ లేని రోగి.. ఎప్పుడూ ధూమపానం కూడా చేసిన చరిత్ర లేకపోయినా, ఆయనకు శ్వాసనాళంలో భారీ కణితి రావడంతో తీవ్రమైన దగ్గు, ఆయాసం, జ్వరంతో బాధపడుతూ వెంటిలేటర్ మీద హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సాధారణంగా అయితే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సిన ఇంత పెద్ద కణితిని ప్రత్యామ్నాయ పద్ధతిలో తొలగించి, కిమ్స్ వైద్యులు అతడికి ఊరట కల్పించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్టు డాక్టర్ శ్రీకాంత్ కిషన్ జువ్వా తెలిపారు.
‘‘రోగికి తీవ్రంగా ఆయాసం వస్తూ, ఊపిరి అందని పరిస్థితి ఏర్పడటంతో నిజామాబాద్‌లోని ఒక ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నా ఎంతకీ నయం కాకపోవడంతో అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇక్కడకు వచ్చేసరికి రోగికి తీవ్రమైన దగ్గు, ఆయాసం, జ్వరం ఉన్నాయి. బ్రాంకోస్కోప్ చేసి చూస్తే శ్వాసనాళంలో పెద్ద కణితి ఉంది. అది 1.8 సెంటీమీటర్ల వెడల్పు, 2.5 సెంటీమీటర్ల పొడవుతో దాదాపు శ్వాసనాళంలో 80-90%ను ఆక్రమిస్తోంది. సాధారణంగా పురుషుల్లో శ్వాసనాళం వెడల్పు 1.5 నుంచి 2 సెంటీమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది. ముందుగా గుర్తిస్తే ఇంత సమస్య ఉండకపోవచ్చు. ఈ రోగికి దాదాపు మూడు నెలల నుంచి సమస్య ఉంది. ఇవి చాలా నెమ్మదిగా పెరిగే కణితి. అప్పుడప్పుడు మాత్రమే దగ్గు, ఆయాసం వచ్చేది. ఈ మూడు నెలల్లో అది బాగా పెద్దది కావడంతో సమస్య ఇంతవరకు వచ్చింది. ఈ తరహా కణితులు 70-80% వరకు శ్వాసనాళాన్ని ఆక్రమిస్తే తప్ప ఇబ్బంది తెలియదు. అందువల్ల ముందే తెలుసుకోవడం కష్టమవుతుంది.
సాధారణంగా అయితే ఇంత పెద్ద కణితులను ఆపరేషన్ చేసి తీస్తారు. కానీ, ఇక్కడ మాత్రం రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపిక్ పద్ధతిలో కణితిని తొలగించాం. ఈ తరహాలో ఉండే, ఇంత పెద్ద కణితులను శస్త్రచికిత్స అవసరం లేకుండా తొలగించడం చాలా అరుదు. అసలు ఈ తరహా ట్యూమర్లే దాదాపుగా కోటిమందిలో ఒకరికి మాత్రమే వస్తాయి. కణితిని బయటకు తీసిన తర్వాత బయాప్సీకి పంపగా, అది బినైన్ ట్యూమర్ అని తెలిసింది. అంటే కేన్సర్ కాదు. అందువల్ల భవిష్యత్తులో బ్రాంకోస్కోప్ చేసి చూసుకుంటే సరిపోతుంది తప్ప, మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే కణితి తీసేశాం కాబట్టి, ఇది మళ్లీ పెరిగే అవకాశం చాలా తక్కువ. అదే కేన్సర్ అయి ఉంటే మళ్లీ పెరిగేది’’ అని డాక్టర్ శ్రీకాంత్ కిషన్ జువ్వా వివరించారు.