కాలేయాన్ని ఇలా కాపాడుకుందాం, అంతర్జాతీయ కాలేయ దినోత్సవం, ఏప్రిల్ 19న
డా. నవీన్ కుమార్
కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
కిమ్స్ హాస్పిటల్, కర్నూలు.
మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. జీర్ణ ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన ఆహారం సరిగా జీర్ణమయ్యేందుకు, పోషకాలు మన శరీరానికి అందేందుకు, వ్యర్థాలు బయటకు పోయేందుకు ఇది కాలేయం పనితీరు చాలా ముఖ్యం. కానీ చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం .. . ఇలాంటి కారణాల వల్ల కాలేయం చిక్కుల్లో పడుతుంది. ఈ ప్రధాన అవయవానికి వచ్చే ముఖ్యమైన మూడు సమస్యలు ఉన్నాయి. ఇవి ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
కాలేయంలో కణితులు(లివర్ సిస్టులు)
కాలేయంలో కణితులు ఏర్పడడం ఒక్కోసారి పుట్టుకతోనే జరుగుతుంది. ఇవి ఒకట్రెండు కణితులు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు నీటి బుగ్గలు కూడా ఏర్పడతాయి. వీటిని వెంటనే చికిత్స అందించకపోతే కాలేయం మొత్తం పాకేస్తాయి. ఈ సమస్యను ‘అడల్ట్ పాలిసిస్టిక్ డిసీజ్’ అంటారు. జన్యులోపాల వల్ల ఇది కలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు వైరస్, బ్యాక్టిరియా వంటి పరాన్న జీవుల వల్ల కూడా కలగవచ్చు. వీటిని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. ఇవి కాలేయంలో ఏర్పడినప్పుడు పొట్టలో కుడివైపు నొప్పి వస్తుంది. ఆ నొప్పికి జ్వరం కూడా తోడవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అల్ట్రాసౌండ్ పరీక్షలతో వాటిని గుర్తించి వాటి సైజునుంచి బట్టి చికి్త్స చేస్తారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో వాటిని తొలగించే అవకాశం కూడా ఉంది.
గాల్ బ్లాడర్
కాలేయం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు విడుదలయ్యే రసాలు బైల్ గొట్టాల ద్వారా ప్రయాణిస్తుంది. ఒక్కోసారి బైల్ గొట్టాలు, గాల్ బ్లాడర్లలో చిన్న చిన్న రాళ్లు ఏర్పడతాయి. దీనికి కారణం ఇన్ఫెక్షన్ కావచ్చు. అలాగే కొవ్వు వల్ల కూడా జరుగుతుంది. ఈ సమస్య పుట్టుకతో కూడా వచ్చే అవకాశం ఉంది. కళ్లు రంగు మారడం, పొట్టలో కుడివైపున నొప్పి రావడం, చలిజ్వరం ఈ సమస్య ప్రాథమిక లక్షణం. రక్తపరీక్ష, స్కానింగుల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. స్టోన్స్ ను తొలగించేందుకు చాలా అధునాతన పద్ధతులు వచ్చాయి.
కాలేయ క్యాన్సర్
కాలేయ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైనది. కాలేయంలో క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను ‘హెపటో సెల్యులార్ క్యాన్సర్’ అంటారు. ఇది ప్రధానంగా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకొనే వారిలో ఏర్పడుతుంది. హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ ఇన్ ఫెక్షన్ తో ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లో ( 2 నుంచి 7 సంవత్సరాల వయస్సు పిల్లలు)ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. దీన్ని హెపటో బ్లాస్టోమా అంటారు. కొన్నిసందర్భాలలో లివర్ లోనే క్యాన్సర్ ఏర్పడవచ్చు. లేదా జీర్ణ వ్యవస్థ లోని ఇతర భాగాల్లో లేదా ఇతర శరీర భాగాల్లో క్యాన్సర్ జనించి కాలేయంలోకి పాకవచ్చు. పొట్ట పైభాగంలో నొప్పి రావడం, బరువు తగ్గిపోవడం, కళ్లు రంగు మారడం, నలుపు రంగులో విరేచనాలు కావడం వంటివి దీని లక్షణాలు. ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించాలి. ముదిరిపోయాక గుర్తిస్తే పరిస్థితి చేయిదాటుతుంది. రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా సమస్యను గుర్తిస్తారు. ఒక్కోసారి బయాప్సీ కూడా చేయాల్సి వస్తుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగిస్తారు.
ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలి, సరైన నిద్ర, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండడం ద్వారా కాలేయాన్ని కాపాడుకోవచ్చు.