జర్నలిస్టుల కుటుంబాలకు ఈనెల 27న చెక్కుల పంపిణీ: అల్లం నారాయణ
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 27వ తేదీన చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 30 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, నలుగురు మంది తీవ్ర ప్రమాదాలు/అనారోగ్య బారిన పడిన జర్నలిస్టుల దరఖాస్తుదారులకు చెక్కుల పంపిణీని ఈ నెల 27వ తేదీ శుక్రవారంనాడు మధ్యాహ్నం 11-00 గంటలకు సమాచార భవన్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో అందజేస్తామని ఆయన తెలిపారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు.
ఇప్పటివరకు 224 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని, ఆయా కుటుంబాలకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తున్నామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్ కే జి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న 124 మంది విద్యార్థులకు నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును అందజేస్తున్నామన్నారు. దీనితో పాటు తీవ్ర అనారోగ్య కారణంగా పనిచేయలేని 87 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్థిక సహాయము సంక్షేమ నిధి నుంచి అకాడమీ అందజేసిందని ఆయన తెలిపారు.