మహిళల ఆరోగ్యంతోనే సమాజం ముందడుగు-గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
* అన్ని రంగాల వారూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి
కిమ్స్ కడల్స్ మహిళా ఆరోగ్య సదస్సులో గవర్నర్
డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్, మే 11, 2023: కుటుంబంతో పాటు సమాజంలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు బాగుంటేనే సమాజం ముందడుగు వేస్తుందని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మహిళలు తమ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలని చెప్పారు. ఆలస్యం చేసేకొద్దీ చిన్నది అనుకునే సమస్య చాలా పెద్దదైపోతుందని, అందువల్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలోని నోవోటెల్ హోటల్‌లో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మహిళా ఆరోగ్య సదస్సు -2023కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవమూ ఎంతో ముఖ్యమైనదేనని, అన్నింటి పనితీరు విషయంలో మనం సరైన అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ తమిళిసై ఈ సందర్భంగా చెప్పారు. భర్త, పిల్లలు, లేదా తల్లిదండ్రులు పట్టించుకుంటారులే అని వదిలేయడం సరికాదని... ఎవరికి వారే తమ ఆరోగ్యం విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు.. ఇలా ఏ రంగంలోనైనా దూసుకుపోతున్న మహిళలు ఒక్క ఆరోగ్యం విషయాన్ని మాత్రం సరిగా పట్టించుకోకపోవడం కనిపిస్తోందని ఆమె తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినందుకు డాక్టర్ కె. శిల్పిరెడ్డిని ఆమె అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అభిలషించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె.శిల్పిరెడ్డి స్వాగతించారు. ఈ సదస్సులో
కిమ్స్ గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. భాస్కర్ రావు, కిమ్స్ ఆపరేషన్స్ హెడ్ శ్రీమతి అనిత, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి నియోనాటాలజిస్టు, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి. అపర్ణ, ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గ జి.రావు, కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు డాక్టర్ జానకి, కిమ్స్ ఆస్పత్రుల గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు. తన విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు గవర్నర్ డాక్టర్ తమిళిసైకి డాక్టర్ వి. సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారు తమ ఆరోగ్యం గురించి నిపుణులను సంప్రదించే అవకాశం కల్పించడం, తమ సొంత ఆరోగ్య సమస్యలను గురించి ధైర్యంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ఉమెన్స్ హెల్త్ కాన్ క్లేవ్ లక్ష్యమని డాక్టర్ శిల్పిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో గర్భం, మెనోపాజ్, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ నివారణ లాంటి అనేక అంశాలపై నిపుణులు వివరించడంతో పాటు విభిన్న వర్గాల నుంచి హాజరైన మహిళలు ఆయా అంశాలపై చర్చించి, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
మహిళలు తమ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, ఇతర మహిళలతో సంబంధాలు పెంపొందించుకోడానికి, వాళ్ల ఆరోగ్యంపై వాళ్లకే తగిన నియంత్రణ ఉండేలా చేయడానికి ఈ సదస్సు ఒక గొప్ప అవకాశంగా నిలిచింది. మహిళలు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణుల నుంచి సమాధానాలు పొందడానికి ఇది మంచి వేదికగా నిరూపితమైంది.
గృహిణులతో పాటు ఉద్యోగాలు చేసేవారు, వ్యాపార రంగంలో ఉన్నవారు, సొంతంగా సంస్థలు స్థాపించి దూసుకెళ్తున్నవారు, రాజకీయ రంగంలో రాణిస్తున్న పలువురు మహిళలు ఈ సదస్సుకు హాజరై, గవర్నర్.. స్వయంగా వైద్యురాలు కూడా అయిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌తో నేరుగా ముచ్చటించారు. ఆరోగ్యం విషయంలో తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.