ఇచ్చిన మాటలన్ని నెరవేరుస్తాం: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన ప్రాంతాలలో 250 కోట్ల రూపాయలతో 3 ఫేజ్ కరెంటు ఇస్తున్నాం
గిరివికాసం ద్వారా 105 కోట్ల రూపాయలతో గిరిజనుల భూములలో బోర్లు వేసి, మోటార్లు వేసి సాగుకు యోగ్యంగా చేస్తున్నాం
దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్ వాడీలకు వేతనం పెంచారు
మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు
మంత్రి పువ్వాడ అజయ్ గారి సహకారంతో ఇక్కడి అభివృద్ధిలో నా సాయ శక్తులా పనిచేస్తాను
పల్లె ప్రగతి-2లో ఏ కొరత లేని పల్లెలుగా మన తెలంగాణ పల్లెలు తయారు కావాలి
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంతో దూరదృష్టితో అమలు చేస్తున్న పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుని మన గ్రామాలను ఏ లోటు లేని పల్లెలుగా మార్చుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గత 30 రోజుల ప్రణాళికలో కొత్తగూడెంలో పాల్గొన్నామని, అప్పటి పల్లె ప్రగతిలో చాలా కార్యక్రమాలు చేపట్టామని, ఈసారి రెండో దశలో గ్రామంలో ఇంకా మిగిలిన పనులన్ని పూర్తి చేసి సర్వ సమగ్ర పల్లెలుగా తీర్చదిద్దుకోవాలన్నారు. నేడు దుమ్ముగూడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి-2 కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ గారితో కలిసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఇటీవలే 250 కోట్ల రూపాయలను ఖర్చు చేసి గిరిజన ప్రాంతాలన్నింటికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా గిరివికాసం పథకం కింద గిరిజన భూములకు బోర్లు వేసి, మోటార్లు ఇచ్చి వాటిని వ్వవసాయ యోగ్యం చేస్తున్నారని తెలిపారు.
మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సిఎం కేసిఆర్ గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అంగన్ వాడీలకు ఎక్కడా పెంచని విధంగా వేతనాలు పెంచారన్నారు. గర్భిణీ స్త్రీలకు అంగన్ వాడీ కేంద్రాలలో మధ్యాహ్నం ఉచిత భోజనం అందిస్తున్నారని చెప్పారు. అయితే అంగన్ వాడీ టీచర్లు కొంతమంది మాటలు విని ధర్నాలు చేయడం సరైంది కాదన్నారు.
అనతరం గంగోలు గ్రామం, దుమ్ముగూడెం మండలంలో, భద్రాద్రి - కొత్తగూడం జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు వెచ్చించి, నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పోడెం వీరయ్య, కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచులు పాల్గొన్నారు.