హైదరాబాద్‌లో తొలిసారిగా ఎముకకు స్టెంట్
* 65 ఏళ్ల మహిళకు కిమ్స్ కొండాపూర్ వైద్యుల చికిత్స
* పడిపోయి ఎముకలు విరిగే వృద్ధులకు ఇదో వరమంటున్న వైద్యులు
హైదరాబాద్, జులై 18, 2023: హైదరాబాద్ నగర వైద్యచరిత్రలోనే తొలిసారిగా.. 65 ఏళ్ల మహిళకు వెన్నెముకలో స్టెంటింగ్ వేశారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ కృష్ణచైతన్య ఈ అత్యంత అరుదైన చికిత్స చేశారు. కిమ్స్ ఆస్పత్రికి రావడానికి ముందు, కింద పడిపోయినా.. ఫ్రాక్చర్ అయిన విషయాన్ని ఆ రోగి గుర్తించలేదు. స్కాన్ చేసిన తర్వాత ఆమె ఎల్2 వెర్టెబ్రల్ ఎముకలో ఫ్రాక్చర్ ఉందని, అందువల్ల త్వరగా కోలుకోవాలంటే వెర్టెబ్రల్ బాడీ స్టెంటింగ్ చేయాలని సూచించారు.
ఆస్టియోపోరోసిస్ వల్ల విరిగే ఎముకల చికిత్సకు అత్యంత అధునాతనమైన ఈ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందది. నగరంలోనే అత్యంత ప్రముఖస్థానంలో ఉన్న కిమ్స్ ఆస్పత్రిలోని వైద్యులు.. అచ్చం గుండెకు స్టెంట్ వేసినట్లే.. ఈ ఎముకకు కూడా ఒక మెటల్ స్టెంట్ వేయడం ద్వారా రోగికి ఊరట కల్పించారు.
ఈ సమస్య గురించి, రోగికి అందించిన చికిత్స గురించి కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ‘‘రోగి జూన్ నెలలో ఇంట్లో కింద పడిపోవడంతో విపరీతంగా వెన్నునొప్పి వస్తోంది. కనీసం నడవలేకపోతుండటంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లగా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆమెకు గ్యాస్ట్రైటిస్, ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. అప్పుడు కిమ్స్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సృజన్ వద్దకు వెళ్లగా.. ఆయన నా వద్దకు పంపడంతో వెన్నెముక విరిగిన విషయం గుర్తించాను. అయితే, ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయడం చాలా ముప్పుతో కూడుకున్నది. దాంతో సెడేషన్ మాత్రం ఇచ్చి స్టెంటింగ్ చేయాలని నిర్ణయించాం. ఫ్రాక్చర్ వల్ల ఆమె ఎముక పొడవు తగ్గిపోవడంతో.. దాన్ని సరిచేయడానికి స్టెంట్ పంపాం.
ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్లు, ఇతర చిన్నపాటి సమస్యలు ఉన్న పెద్దవయసు వారికి వెన్నెముకలోని ఎముకలు విరిగితే ఈ చికిత్స చాలా ఉపయోగకరం. ఈ స్టెంట్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వారు తయారుచేశారు. సాధారణంగా ఇది ఎముక పొడవులో 80% ఉంటుంది. రోగి ఎముక పొడవును అనుసరించి అనేక రకాల స్టెంట్లు ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియను కేవలం 20 నిమిషాల్లో, రక్తం అస్సలు పోకుండా చేయగలిగాం. సాధారణంగా శస్త్రచికిత్స చేస్తే 3-4 గంటలు పట్టడంతో పాటు రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి శస్త్రచికిత్సల్లో అయితే స్క్రూలు బిగిస్తాం. దానివల్ల కోలుకోవడానికి కూడా చాలా నెలలు పడుతుంది. కానీ, ఈ ప్రక్రియలో స్టెంట్‌ను కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ రంధ్రం ద్వారా పంపాం. అది లోపలకు వెళ్లి, ఎముక వద్ద విస్తరిస్తుంది. దానివల్ల ఎముక తన సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇలా ఎముక విరిగితే దాని పొడవు అర సెంటీమీటరు నుంచి ఒక సెంటీమీటరు మేర తగ్గుతుంది. స్టెంట్ వల్ల ఎముక తన సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఎలాంటి నొప్పి కూడా లేకపోవడంతో.. ఆపరేషన్ అయిన కొద్ది గంటలకే రోగి లేచి నడవగలిగారు” అని డాక్టర్ కృష్ణ చైతన్య వివరించారు.
డాక్టర్ కృష్ణచైతన్యకు ఈ ఏడాది జనవరిలో జపాన్ లో జరిగిన ప్రపంచ బోలు ఎముకల వైద్య సదస్సుకు భారతదేశం నుంచి అధ్యాపకుడిగా ఆహ్వానం అందింది. ఆయనతో ఇతరులకు ఈ విధానంలో శిక్షణ ఇప్పించారు. ఇలాంటి అత్యాధునిక చికిత్సలతో.. అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడం, రోగి పూర్తిస్థాయిలో కోలుకునేలా చూడటం కూడా చాలా వీలుగా ఉంటుంది.