సెంట్రల్ ప్రగతిపై సీఎం జగన్ ముద్ర శాశ్వతం; రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర శాశ్వతమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 23, 25 వ డివిజన్లలో రూ. 45.88 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గా, వైసీపీ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపనలు నిర్వహించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి ఒక్క డివిజన్ ను పార్టీలకతీతంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధిపరుస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఈ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి వారోత్సవాలను నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 23వ డివిజన్ సూర్యనారాయణ వీధి, వేమూరి వారి వీధి., 25వ డివిజన్ కుప్పా వారి వీధి, రామమందిరం రోడ్డులకు భూమిపూజ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలకు.. ప్రజల సమక్షంలో నిర్వహించుకుంటున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే సమాధానమని మల్లాది విష్ణు అన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం హయాంలో నగరం ఎందుకు నిర్లక్ష్యానికి గురైందో..? అభివృద్ధి నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో..? గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వారు కోరుకుంటున్న అభివృద్ధిని చేతల్లో చూపడం జరుగుతోందన్నారు.
కార్యక్రమంలో 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బాలి గోవింద్, 23వ డివిజన్ వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, నాయకులు ఒగ్గు విక్కీ, బంకా భాస్కర్, వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, కొల్లిపర శ్రీను, ఎ.అప్పారావు, అబ్దుల్ నజీర్, కోలంటి రవి, యక్కల మారుతి, చినబాబు, లక్ష్మణ, అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.