jaitly: ప్రజలకు సరిపడేంత నగదును ఆర్బీఐ త్వరలోనే సరఫరా చేస్తుంది: అరుణ్ జైట్లీ
ప్రధాని మోదీ సర్కారుకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో కూరుకుపోయిన అవినీతి, నల్లధనం నిర్మూలనకు
ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇప్పుడు మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో అవినీతి ఆకాశాన్ని తాకేలా నమోదయిందని ఆయన అన్నారు. 2014-15 మధ్య కాలంలో దేశంలో రూ.500, 1000 నోట్లు 36 శాతం నుంచి 80 శాతం చలామణీలోకి వచ్చాయని ఆయన అన్నారు.
దేశంలో నగదు రహిత వ్యవస్థను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ఆర్బీఐ ప్రజలకు సరిపడేటంత నగదును త్వరలోనే బ్యాంకులకు సరఫరా చేస్తుందని చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.