jaipal reddy: నోట్ల రద్దుపై గ్రామీణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు: జైపాల్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును తిరిగి తీసుకోకుండా చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దుపై గ్రామీణప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. 80 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశాల్లో ఉందని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ అన్నారని, వాటిని తీసుకొచ్చి ప్రతి భారతీయుడి అకౌంట్లో 15లక్షల రూపాయల చొప్పున వేస్తామన్నారని, కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదని ఆయన అన్నారు.
దేశం మొత్తం క్యాష్‌లెష్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, అసలు 100 శాతం క్యాష్‌లెష్ లావాదేవీలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. విదేశీపెట్టుబడి దారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.