dhoni captaincy: ధోనీ తప్పు చేశాడా?...కోహ్లీకి అదే వరమవుతోందా?
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన తప్పిదం అతని కెరీర్ కు ప్రమాదంగా మారిందా? అంటే క్రీడావిశ్లేషకులు అవుననే అంటున్నారు. సాధారణంగా క్రికెటర్లు ఎవరైనా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకుంటే ముందుగా టీ20లు, వన్డేలకు స్వస్తి చెబుతారు. ఆ తరువాత టెస్టులకు గుడ్ బై చెబుతారు. ఇప్పటి వరకు ఇదే సంప్రదాయం నడిచింది. దిగ్గజాలంతా ఇలా చేసినవాళ్లే. అయితే వీరందరికీ భిన్నంగా ధోనీ వన్డే, టీ20ల్లో కొనసాగుతూ టెస్టుల నుంచి తప్పుకున్నాడు.
దీంతో టీమిండియా ధోనీ నుంచి కోహ్లీకి కెప్టెన్సీని అప్పగించింది. ఒకరకంగా కోహ్లీ కెప్టెన్ గా ఉండగా, ఆటగాడిగా ఆడాల్సిరావడం ధోనీ అహాన్ని ఇబ్బంది పెట్టిందని, అందుకే టెస్టుల నుంచి తప్పుకున్నాడని క్రీడా విశ్లేషకులు పేర్కొంటుంటారు. దీనిని అవకాశంగా మలచుకున్న కోహ్లీ కెప్టెన్ అయిన తరువాత విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వరుస సెంచరీలతో పాటు 50 సగటుతో పరుగులు చేస్తూ అనితర సాధ్యమైన ఫిట్ నెస్ తో పాటు ఫాంతో సమకాలీనులకు సవాల్ విసురుతున్నాడు. దీంతో కోహ్లీని వన్డే, టీ20లకు కూడా కెప్టెన్ గా నియమించాలంటూ డిమాండ్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో టెస్టులు విరివిగా జరుగుతున్న నేపథ్యంలో ప్రాక్టీస్ లేని ధోనీ, వన్డే, టీ20ల్లో రాణించే అవకాశాలు అంతంతమాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కోహ్లీని వన్డే, టీ20 కెప్టెన్ గా నియమించేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. దీంతో ధోనీ యుగం ముగిసినట్టే అనిపిస్తోంది.