old man crying: ఇప్పుడు చెప్పండి ఎవరు ఏడుస్తున్నారు?: సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
డీమోనిటైజేషన్ అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో దేశ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశరాజధానిలోని ఓ బ్యాంకు క్యూ ముందు చోటుచేసుకున్న పరిణామంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజన్లు కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీని నిలదీస్తూ పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... గుర్గావ్ లో ఓ బ్యాంకు ఎదుట పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలో అంతవరకు లైన్ లో నిల్చున్న ఓ పెద్దాయన నిలబడలేక క్యూ పక్కకి వెళ్లారు. దీంతో క్యూలో ఉన్నవారు ఆయనను వెనక్కు తోసేశారు. వెనుక నిల్చోవాలని సూచించారు. దీంతో ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు.
దీనిని ఓ నెటిజన్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో నెటిజన్లు కేంద్రం, ప్రధానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులు ఏడుస్తారని, పేదలు నవ్వుతున్నారని బహిరంగ సభల్లో ప్రధాని చెబుతున్నారని, కానీ వాస్తవంగా ఎవరు ఏడుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బడా బాబులెవరూ డబ్బు కోసం ఇబ్బంది పడడం లేదని, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, నిరుపేదలు క్యూలైన్లలో నిలబడి మరణిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలకు జరిగిన మేలు ఏంటని వారు నిలదీస్తున్నారు. రాజకీయాలబ్ది కోసం దేశ ప్రజలందర్నీ నానాకష్టాలు పెడుతున్నారని ఆయన తెలిపారు.