kishan reddy: ఆడ‌వారి బంగారంపై కొంద‌రు అసత్య ప్ర‌చారం చేస్తున్నారు: అసెంబ్లీలో కిష‌న్‌రెడ్డి


పెద్ద‌నోట్ల ర‌ద్దు ఇబ్బందుల వెనుక ఎన్ని లాభాలున్నాయో ఆలోచించాలని బీజేపీ ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో దేశానికి విదేశీ పెట్టుబ‌డులు వ‌స్తాయని, బ్యాంకు వ‌డ్డీ త‌గ్గుతుందని, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ అంశం లాభిస్తుంద‌ని అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. భూముల వ్యాపారంలో న‌ల్ల‌డ‌బ్బు కీల‌క పాత్ర పోషిస్తోందని, రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యధిక నల్లధనం ఉందని, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌తో రానున్న రోజుల్లో న‌ల్ల‌ధ‌నం త‌గ్గుతుందని, త‌క్కువ వ‌డ్డీకి న‌గ‌దు ల‌భించి, పేద‌లు ఇళ్లు కొనుక్కుంటారని అన్నారు.
 
పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో 50 రోజులు క‌ష్టం ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఆనాడే చెప్పారని కిష‌న్‌రెడ్డి అన్నారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయని అన్నారు. ప్ర‌జ‌ల డబ్బుకి, బంగారంకి ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌దని అన్నారు. ఆడ‌వారి బంగారంపై కొంద‌రు అసత్య ప్ర‌చారం చేస్తున్నారని అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల‌ తాత్కాలిక ఇబ్బందులే త‌ప్ప‌ దీర్ఘ‌కాలికంగా ఇబ్బందులు ఉండ‌బోవ‌ని అన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్య అన్ని అంశాల్లో అనేక లాభాలు ఉంటాయ‌ని చెప్పారు.

డిజిట‌ల్ లావాదేవీల ద్వారా అవినీతి త‌గ్గ‌డం రాష్ట్ర ఆదాయానికి క‌లిసి వ‌స్తుంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో న‌ల్ల‌కుబేరులు, స్మ‌గ్ల‌ర్లు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా డ‌బ్బును పొదుపుగా వాడుకుంటున్నార‌ని, పొదుపు చేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల డ‌బ్బు పెరుగుతుంద‌ని అన్నారు.  కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌కరించి అండ‌గా నిల‌బ‌డాలని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కి కొన్ని ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

  • Loading...

More Telugu News