demonitization: నేను తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు కూడా ఇలాగే అన్నారు: పెద్దనోట్ల రద్దుపై కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం విజయవంతమైతే దేశం 100 శాతం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు అంశంలో ఎన్నో విమర్శలు వస్తున్నాయని, దాని ఫలితం వస్తే మాత్రం ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. తెలంగాణ కోసం తాను బయలుదేరినప్పుడు అది సాధ్యం కాదని ఎంతో మంది అన్నారని కేసీఆర్ అన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. లక్ష అడుగుల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రజలు ఎన్నో కష్టాలుపడ్డట్లే ఇప్పుడు కూడా పెద్దనోట్ల రద్దు అంశంలో కష్టాలు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇంత పెద్ద నిర్ణయానికి ఎందుకు సపోర్ట్ చేయకూడదని అన్నారు.
నల్లధనాన్ని పేదలకోసమే ఖర్చుపెడతామని నరేంద్ర మోదీ చెప్పారని కేసీఆర్ అన్నారు. తన మాట నిలుపుకోకపోతే తనని శిక్షించాలని కూడా ప్రధాని మోదీ అన్నారని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలకి ఇది కలిసొచ్చే అంశమని చెప్పారు. నగదురహిత లావాదేవీలు జరిగితే రాజకీయాలు కూడా బాగుపడతాయని అన్నారు. రాజకీయాల్లో మంచివారు ఉన్నప్పటికీ అందరూ అవినీతి పరులనే భావన ఉందని కేసీఆర్ అన్నారు. క్యాష్‌లెస్ ఎకానమీతో అవినీతి పోతుందని, ఇప్పుడు ఆ మార్పు దిశగా దేశం అడుగులేస్తుందని అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికి మంచి జరుగుతుందని అంటే ఎందుకు వ్యతిరేకించాలని ప్రశ్నించారు.