demonitisation: 100 రూపాయల నోటుకు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది: ప్రధాని మోదీ
దేశంలో అవినీతిని నిరోధించడమే ప్రభుత్వ లక్ష్యమని ప‌్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ లో నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో ఆరు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక శిక్షణ అందించడం నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యమని చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలే శక్తి యువతలోనే ఉందని అన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు.
దేశంలో వెయ్యి రూపాయల నోటు చలామణీలో ఉన్నప్పుడు 500, 100 రూపాయల నోటు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదని, పెద్దనోట్ల రద్దు అనంతరం ఇప్పుడు 100 రూపాయల నోటుకు కూడా ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందని మోదీ అన్నారు. దేశంలో అవినీతిని నిరోధించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పార్లమెంటులో ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వెనుకాడాయని ఆయన ప్రశ్నించారు.