income tax notices: రూ.5.4 కోట్ల ట్యాక్స్‌ పెండింగ్‌ ఉందంటూ ఆఫీస్ బోయ్‌కు నోటీసులు పంపించిన ఐటీ అధికారులు


ఓ కంపెనీలో ఆఫీస్ బోయ్‌గా ప‌నిచేస్తోన్న ఓ వ్య‌క్తి ఇటీవ‌ల ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు అందుకుని షాక్‌కు గుర‌య్యాడు. తాను ఐటీకి ఏకంగా రూ.5.4 కోట్ల ప‌న్ను క‌ట్టాల్సి ఉంద‌ని అందులో అధికారులు పేర్కొన‌డాన్ని చూసి బిత్త‌ర‌పోయాడు. అత‌డి పేరిట నాలుగు కంపెనీలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ముంబ‌యిలో రవి జైశ్వాల్‌ (32) అనే వ్యక్తికి ఈ వింతైన‌ అనుభ‌వం ఎదురైంది. ఆ నోటీసులు అందుకున్న అనంత‌రం స‌ద‌రు వ్య‌క్తి ఈ కేసులో విచార‌ణ ప్రారంభిస్తోన్న థానే ఎస్పీ మహేశ్‌ పాటిల్‌ వద్దకు వెళ్లి త‌న వివరాలు తెలిపాడు. దీంతో పోలీసులు అస‌లు విష‌యాన్ని క‌నిపెట్టారు. ర‌వి జైశ్వాల్‌ ఆధార్‌, పాన్‌ కార్డులను అక్ర‌మంగా వినియోగించుకున్న ఓ వ్యక్తి నాలుగు కంపెనీలు పెట్టినట్లు తెలుసుకున్నారు.

భయందర్ లోని గణేశ్‌ దేవల్‌ నగర్‌ కు చెందిన రవి కాండివ్లిలో చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ రాజేశ్‌ అగర్వాల్‌ వద్ద 2008 ఆగస్టులో పని చేశాడు. అప్ప‌ట్లో ర‌వి వ‌ద్ద నుంచి బ్యాంకు ఖాతాకోసం అంటూ బ్యాంకులో జీతం పడుతుందని చెప్పి అతడి పాన్‌, ఆధార్‌ కార్డులు తీసుకున్నాడు రాజేశ్ అగ‌ర్వాల్‌. అయితే, ర‌వికి చెల్లించాల్సిన జీతం మాత్రం అకౌంట్లో కాకుండా చేతికే ఇచ్చే వాడు. 2012లో రాజేశ్ ద‌గ్గ‌ర ప‌ని మానేసిన ర‌వి వేరే కంపెనీలో ప‌నిలో చేరాడు. ర‌వి ఇచ్చిన ఆధార్‌, పాన్ కార్డుల‌ను ఉప‌యోగించుకొని రాజేశ్ అగ‌ర్వాల్ మోసం చేశాడ‌ని పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో అగర్వాల్‌(42)తో పాటు మరో మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు థానే కోర్టులో వారిని ప్ర‌వేశ‌పెట్టి, త‌రువాత జైలుకి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News