mudragada: కాపులకు జరిగిన అన్యాయాన్ని భరించలేకే ప్రభుత్వంపై ముద్రగడ ఒత్తిడి తెస్తున్నారు: వైసీపీ నేత భూమన
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఈ రోజు కలిశారు. ముద్రగడ చేస్తోన్న ఉద్యమానికి ఆయన తమ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఇప్పుడు మోసపోయిన అన్ని వర్గాలూ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు వాటన్నిటినీ మరచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను ముద్రగడ పద్మనాభాన్ని అభినందించడానికే వచ్చానని చెప్పారు.
కాపులకు జరిగిన అన్యాయాన్ని చూసి భరించలేకే ముద్రగడ రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెస్తున్నారని భూమన అన్నారు. ఈ ఏడాది జనవరి 19న ముద్రగడ నిర్వహించిన సభకు నైతిక మద్దతు ఇవ్వడానికి తాను వెళితే తనను చంద్రబాబు నాయుడు ద్రోహిగా, అరాచక శక్తిగా సృష్టించడానికి యత్నించారని అన్నారు. కాపులు చేస్తోన్న ఉద్యమానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. కాపులపై హామీల వర్షం కురిపించి వాటిని పట్టించుకోనందుకే ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై వీరోచిత పోరాటానికి దిగారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా కలవొచ్చు కాబట్టే తాను ముద్రగడ పోరాటానికి మరోసారి మద్దతు పలకడానికి వచ్చానని స్పష్టం చేశారు.