sheela dikshit: నా పేరును అందులోకి లాగొద్దు: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్
ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీకి సహారా గ్రూపు రూ.40 కోట్ల లంచం ఇచ్చిందని ఆరోపించారు. ఈ క్రమంలో అసలు సహారా గ్రూపు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిందన్న జాబితాను తాజాగా కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. అయితే, ఆ జాబితాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ పేరు కూడా ఉండడం గమనార్హం. షీలా దీక్షిత్‌కు 2013 సెప్టెంబర్ 23వ తేదీన కోటి రూపాయలు చెల్లించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై షీలా దీక్షిత్ స్పందిస్తూ ఈ విషయంలో తాను ప్రస్తుతం మాట్లాడేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్నారు.
ఆ సమయంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా తనకు గుర్తులేదని ఆమె వ్యాఖ్యానించారు. తమ పార్టీ ట్విట్టర్లో పేర్కొన్న ఆ అంశానికి వ్యతిరేకంగా తాను ఏమీ మాట్లాడబోనని ఆమె చెప్పారు. అసలు తన పేరును ఆ జాబితాలోకి లాగొద్దని వ్యాఖ్యానించారు. అది ఏ డైరీ? ఎవరి డైరీ? అందులో ఎవరు ఏం రాశారో తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ప్రధానిపై ఆరోపణలు చేసే క్రమంలో ఇలా సొంత పార్టీ నేతపైనే కాంగ్రెస్ ఆరోపణలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.