kodandaram: జేఏసీ కార్యకర్తలను అరెస్టు చేసి రాత్రంతా చలిలో ఉంచారు... ఇంత భయంతో పాలన ఎందుకు?: కోదండరాం ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోన్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా దీక్షకు దిగిన ప్రొ.కోదండరాం తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు నిరంకుశంగా ఉందని, ఎవరు సర్కారుకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్టు చేయడం మంచిదికాదని అన్నారు. జేఏసీ కార్యకర్తలని అరెస్టు చేసి రాత్రంతా చలిలో ఉంచారని ఆయన అన్నారు. ఇంత భయంతో ప్రభుత్వం పాలన సాగించడం ఎందుకని కోదండరాం ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని అన్నారు. ధర్నా చేయడానికి అనుమతి రాకపోవడంతో ఇంకేదయినా రూపంలో నిరసన తెలుపుదామని తాము అనుకున్నామని ఆయన న్నారు. తాము దాడులకు దిగలేదని చెప్పారు.
ప్రశాంతంగా నిరసన తెలుపుదామనుకున్నామని కోదండరాం అన్నారు. అయినప్పటికీ అరెస్టులు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నిరసన తెలపడం తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు. అరెస్టయిన వారిని విడుదల చేయాలని, అప్పటివరకు తన దీక్షను ఆపబోనని అన్నారు. తాను చేస్తున్నది నిరాహార దీక్ష అని ప్రకటించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటన రావాలని అప్పటివరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.