ram vilas: ఇకపై మీకు నచ్చితేనే రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీస్ ఛార్జ్ కట్టండి: కేంద్ర ప్రభుత్వం
దేశంలోని హోటల్స్, రెస్టారెంట్స్ సిబ్బంది తమ కస్టమర్లకు సర్వీసు అందించిన అనంతరం వారు తిన్న పదార్థాల బిల్లుతో పాటు ఎక్స్‌ట్రాగా సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తారన్న విషయం తెలిసిందే. కస్టమర్లు ఆ చార్జ్‌ను చెల్లించకతప్పదు. ఈ ఛార్జ్ సాధారణంగా బిల్లుపై ఐదు నుంచి 20 శాతం వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుతం కేంద్రం ఆ సర్వీస్ ఛార్జ్ పై దృష్టి పెట్టింది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఈ అంశంపై ఈ రోజు ఆహార, వినియోగదారుశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పష్టతనిచ్చారు.
బిల్‌పై సర్వీస్ ట్యాక్స్‌ను తీసుకోవడం చట్టరీత్యా నేరని మంత్రి పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సర్వీస్ ఛార్జ్ స్వచ్ఛమైన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న పన్నులకు అదనంగా సర్వీస్ ఛార్జ్‌లను తీసుకుంటున్నాయని, ఈ సర్వీస్ ఛార్జ్‌లను కట్టాలా? వద్దా? అన్న అంశంపై వినియోగదారుకి స్వేచ్ఛనిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లకు, హోటళ్లకు విధించిన కొత్త విధానంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కేంద్ర సర్కారు సూచించింది. కేంద్ర మంత్రి చేసిన ఈ ట్వీట్‌కు స్పందించిన హోటల్ సంఘం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కస్టమర్లు తమకు నచ్చితేనే సర్వీస్ ఛార్జ్ కట్టవచ్చని తెలిపింది.
Restaruants are billing service charges in addition to taxes. Service charge is optional . Consumer has a discretion to pay or not.
— Ram Vilas Paswan (@irvpaswan) January 2, 2017