china phones: భారత మార్కెట్ లో విపరీతంగా అమ్ముడవుతున్న చైనా స్మార్ట్ ఫోన్లు
చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్‌మీడియాలో భారతీయులు ఎంతగా ప్రచారం చేసినా దేశీయ మార్కెట్ లో చైనా స్మార్ట్ ఫోన్లు విపరీతంగానే అమ్ముడుపోతున్నాయి. దాంతో, ఆ దేశ కంపెనీల ప్రభావంతో భారత స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది మన దేశంలో చైనా ఫోన్లు 40 శాతం వరకు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం భారత్ లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో శాంసంగ్ మొదటి స్థానంలో ఉంటే, చైనా దేశానికి చెందిన కంపెనీ లెనొవో రెండో స్థానంలో నిలిచింది. ఈ అంశాన్ని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సర్వే ఆధారంగా చైనా అధికారిక పత్రిక పేర్కొంది.
ఇక భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌లలో 7 శాతంతో జియోమి మూడో స్థానంలో ఉంది. 30 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం, భారత స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు తగ్గిపోయాయి. దేశీయ కంపెనీ అయిన మైక్రోమ్యాక్స్ అమ్మకాలు అక్టోబర్ లో 16.7 శాతం తగ్గాయని తెలిపింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భవిష్యత్తులో మరింత పెరుగనున్నాయి. భారత్‌లో తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేలో తేలింది. అందుకే లెనొవో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.