chandrababu: అతి తక్కువ కాలంలోనే నగదు సమస్యను అధిగమించగలిగాం: ముఖ్యమంత్రి చంద్రబాబు


తిరుపతిలో జరుగుతున్న సైన్స్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు విజ‌య‌వాడ‌లోని త‌న‌ నివాసం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల‌పై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న అనంత‌రం  బ్యాంకర్లు, అధికారులు ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చేందుకు ఎంతో సహకారాన్ని అందించార‌ని, దీంతో అతి తక్కువ కాలంలోనే నగదు సమస్యను అధిగమించగలిగామని తెలిపారు.

తాము తీసుకున్న చర్యల ఫ‌లితంగా పింఛన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు త‌లెత్త‌లేద‌ని చంద్రబాబు చెప్పారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో న‌గ‌దురహిత  లావాదేవీల సగటు 24 శాతం కొనసాగుతున్నట్లు చంద్ర‌బాబు నాయుడికి అధికారులు తెలిపారు. ఈ స‌గ‌టు 50 శాతానికి పెరిగేలా ప్రోత్స‌హించాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఏపీలో బ్యాంకు ఖాతాలకు ఖాతాదారులు 78 శాతం మంది ఆధార్ అనుసంధానం చేసుకున్నార‌ని, త్వ‌ర‌లోనే 100 శాతం పూర్తయ్యేలా చూడాల‌ని చెప్పారు.

రాష్ట్రంలో జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో అంద‌రూ పాల్గొనేలా ప్రోత్స‌హించాల‌ని చంద్ర‌బాబు నాయుడు సూచించారు. జలకళతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ నిండిపోవాల‌ని అన్నారు. ఏపీలోని వాగులు, వంకలపై అవసరమైన చెక్‌డ్యాములు నిర్మించాలని సూచించారు. రైతులు రబీ రుణాలను పొందే క్ర‌మంలో వారిని ఇబ్బంది పెట్టకూడ‌ద‌ని చెప్పారు. సంక్రాంతి పండుగ‌కు మూడు రోజుల ముందే చంద్ర‌న్న సంక్రాంతి కానుకలను లబ్ధిదారులకు ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు.

  • Loading...

More Telugu News