trump hotel: సిరియాలో ట్రంప్ పేరుతో హోటల్ ప్రారంభం!
సిరియాలోని కుర్దుల ప్రాబల్యమున్న కొబానీ నగరంపై రెండేళ్ల క్రితం పెద్ద ఎత్తున దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు... భయభ్రాంతులు సృష్టిస్తూ అక్కడి వేలాది మంది ప్రజలను ప్రాణభయంతో పారిపోయేలా చేశారు. తరువాత కుర్దు స్వయం రక్షక టీమ్‌లు అమెరికా వాయుసేన సాయంతో తిరిగి ఉగ్రవాదులపై దాడులు జరిపి వారిని తరిమికొట్టాయి. అయితే, ఇప్పుడు అదే నగరంలో వాలిద్ షేకి అనే వ్యక్తి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ పేరుతో ఒక హోటల్‌ను ప్రారంభించాడు.
తమ ప్రాంతాన్ని రక్షించినందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను నెలకొల్పిన ఈ రెస్టారెంటుకి ట్రంప్ అని పేరు పెట్టానని చెప్పాడు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికన్ సేనలు ఉగ్రవాదులపై మరిన్ని దాడులు జరిపి వారిని పూర్తిగా అంతమొందిస్తాయని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ఈ రెస్టారెంట్లో మధ్యప్రాచ్యంలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయ వంటగా పేర్కొనే ఫలఫెల్ వంటకాలు లభిస్తాయి.