anil vij: ఆ క్యాలెండర్ పైనే కాదు.. కరెన్సీపై సైతం గాంధీ ఫొటో తొలగిస్తే బాగుంటుంది: హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విడుదల చేసిన 2017 క్యాలెండర్, డైరీలపై రాట్నం తిప్పుతున్నట్లుగా మహాత్మా గాంధీ చిత్రాలకు బదులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాలను ప్రచురించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ వైపు కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా స్పందించి మహాత్మాగాంధీని మరిపించగల వ్యక్తి మరెవరూ లేరని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే.. మరోవైపు హర్యానా మంత్రి అనిల్ విజ్ మాత్రం మరింత వివాదాన్ని రేపే వ్యాఖ్యలు చేశారు. సదరు 2017 క్యాలెండర్, డైరీలపై గాంధీ ఫొటోను తొలగించినట్లే ఇప్పుడు కరెన్సీపై కూడా తొలగించాలని వ్యాఖ్యానించారు.
ఖాదీ విషయంలో మహాత్మాగాంధీ కన్నా నరేంద్ర మోదీకే ఎక్కువ పేరు ఉందని అనిల్ విజ్ అన్నారు. ఆ క్యాలెండర్‌పై ఈసారి మోదీ ఫొటో ప్రచురించడంతో ఖాదీ అమ్మకాలు అధికమయ్యాయని అన్నారు. కరెన్సీపై కూడా గాంధీ ఫొటో తీసేస్తేనే బాగుంటుందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను చేస్తోన్న వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటానని కూడా అన్నారు. అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ అవి ఆయన వ్యక్తిగతమని, తమ పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
महात्मा गांधी पर दिया ब्यान मेरा निज़ी ब्यान है । किसी की भावना को आहत न करे इसलिए मैं इसे वापिस लेता हूँ ।
— ANIL VIJ Minister (@anilvijminister) January 14, 2017