special status: ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: రాష్ట్రపతికి లేఖ రాసిన ఎంపీ కేవీపీ
పార్లమెంటు సాక్షిగా ఆ నాడు మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ కేవీపీ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతికి లేఖ రాసినట్లు తెలిపారు. జల్లికట్టు పోరాటం నుంచి స్ఫూర్తిని తీసుకోవాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని దాన్ని పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయం ముందు ఎవరయినా తలవంచవలసిందేనని, జల్లికట్టు కోసం తమిళులు అద్భుతంగా పోరాడారని ఆ విధానాన్ని పరిశీలించాలని తాను మనవి చేశానని అన్నారు. దాన్ని కూడా పట్టించుకోలేదని అన్నారు. తాను ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును రాకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని అన్నారు.
విభజన హామీల అమలులో కేంద్రప్రభుత్వం ఉదాసీన వైఖరి కనబరుస్తోందని కేవీపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తాను రాష్ట్రపతికి లేఖ పంపుతున్నానని, ప్రత్యేక హోదా, 2018లోపు పోలవరం ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం, ఆర్థిక లోటు భర్తీ, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశాలను అందులో ప్రస్తావించానని అన్నారు.