venkaiah naidu: మన్మోహన్ సింగ్, చిదంబరం వ్యాఖ్యల పట్ల వెంకయ్య నాయుడు ఆగ్రహం
ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యల పట్ల వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, దేశంలో కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయని మన్మోహన్, చిదంబరం నిన్న నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన వెంకయ్య నాయుడు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారు అప్పట్లో దేశ ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేశారని అన్నారు. కాబట్టి మన్మోహన్, చిదంబరం చేసిన వ్యాఖ్యలకు విశ్వసనీయత లేదని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వెంకయ్య నాయుడు అన్నారు. సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. సభలో హంగామా చేయకుండా అర్థవంతంగా చర్చల్లో పాల్గొనాలని ఆయన విపక్ష నేతలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని, ఎన్డీఏ తీసుకొస్తోన్న సంస్కరణలను చూడలేకే విపక్ష నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.