Panneerselvam: ఆ కృషి బూడిదలో పోసిన పన్నీరేనా? ఇక పన్నీర్ సెల్వం దారెటు?


రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన తమిళ రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. మొత్తానికి శశికళ విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి వరించింది. మరి, ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటివరకు హీరోగా ఉన్న పన్నీర్ సెల్వం పరిస్థితి ఏమిటి..? ఆయన కథ ముగిసిపోయినట్లేనా.. ఇప్పుడాయన ఏం చేస్తారనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడాన్ని పన్నీర్ విజయంగా భావించే పరిస్థితి లేదు. తమిళనాడుపై తమ పట్టు పెంచుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పన్నీర్ ను ముందు పెట్టి.. ఈ రాజకీయ నాటకం ఆడిందనే ఆరోపణలున్నాయి. లేకపోతే ఇంతకాలం పార్టీలో వీర విధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం ఇలా ఒక్కసారిగా తిరుగుబాటు చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ మొత్తం వ్యవహారానికి తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే కూడా ఓ చేయి వేసి సాయం అందించింది.
జయలలిత మరణం నాటి నుంచే..
జయలలిత మరణాన్ని ప్రకటించిన సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై అన్నాడీఎంకేలో తీవ్ర తర్జన భర్జన జరిగింది. శశికళ తానే సీఎం పీఠంపై కూర్చోవాలనుకున్నా.. ఆ సమయం సరికాదనే ఉద్దేశంతో ఆగిపోయారు. దాంతో సహజంగానే పన్నీర్ సెల్వం పేరు తెరపైకి వచ్చింది. కానీ శశికళ పన్నీర్ సెల్వంను కాకుండా తనకు పూర్తి అనుకూలంగా ఉండే మరొకరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జయలలిత ఆస్తుల కేసులో జైలుకు వెళ్లిన రెండు సార్లూ పన్నీర్ సెల్వంనే తాత్కాలిక సీఎంగా కూర్చోబెట్టారని.. ఇప్పుడు మరొకరికి అప్పగిస్తే సమస్యలు తలెత్తుతాయంటూ చాలా మంది నేతలు స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితులలోనే పన్నీర్ కు శశికళ పచ్చజెండా ఊపినట్టు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉన్న పన్నీర్ సెల్వం.. ఈ విషయం తెలిసినప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారని, దాంతో తనను రాజీనామా చేయాలనే వరకు ఓపిక పట్టి, తిరుగుబాటు జెండా ఎగురవేశారనే వార్తలు వచ్చాయి.
బీజేపీ అండతోనే ధైర్యం?
మరోవైపు తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం పన్ని పన్నీర్ సెల్వంను ఎగదోసిందనే ప్రచారముంది. పన్నీర్ వీలైనంత మంది ఎమ్మెల్యేలను కూడబెట్టుకునేందుకు అవకాశమిచ్చేలా.. గవర్నర్ కాలయాపన చేస్తూ రావడం అందులో భాగమేననే అభిప్రాయముంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గవర్నర్ నుంచి ఎంత తోడ్పాటు అందినా.. శశికళ శిబిరం నుంచి పన్నీర్ పెద్దగా ఎమ్మెల్యేలను బయటికి లాగలేకపోయాడు. శశికళకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించాక అయినా ఎమ్మెల్యేలు తరలి వస్తారన్న అంచనాలూ తలకిందులయ్యాయి. చివరికి చేసేదేమీ లేక శశికళ ఎంపిక చేసిన పళనిస్వామిని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి వచ్చింది.
పన్నీర్ పార్టీని చీల్చుతాడా..?
అదృశ్య శక్తుల తోడ్పాటుతో ధైర్యంగా తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వానికి తొలుత మద్దతుగా నిలిచింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు ఎంపీలు. మరో 30 మంది వరకు ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని, అందువల్లే ఆయన అంత ధీమాగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో పన్నీర్ సెల్వానికి ప్రజల నుంచి, సినీ తారల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో శశికళ అప్రమత్తమై.. ఎమ్మెల్యేలందరినీ క్యాంపునకు తరలించారు. క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను బయటికి రప్పించడానికి పన్నీర్ సెల్వం చేయని ప్రయత్నం లేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన అధికారాలు ఉపయోగించుకుని.. పోలీసులనూ వినియోగించుకున్నా ఫలితం రాలేదు. మెల్ల మెల్లగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం మద్దతు పలికారు.

ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఇక ముందు కూడా ఆయన మరింత మంది ఎమ్మెల్యేలను తన వర్గం వైపు తెచ్చుకోగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం శాసనసభలో ఎమ్మెల్యేల బలమే లెక్క. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 235. ఇందులో ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యేకాగా జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగతా 233 సీట్లలో అన్నాడీఎంకేకు 135 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్ కు 8 మంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. తాజా లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేలు అవసరం. శశికళ శిబిరంలో 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు ఉన్నట్లే. ఇక పన్నీర్ సెల్వం వైపు 10 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం మరో పది మంది ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం చీల్చగలిగితే.. ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోవచ్చు. కానీ పన్నీర్ వర్గంలోని 10 ఎమ్మెల్యేలు కూడా శశికళ వర్గం వైపు వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పన్నీర్ ఒంటరి కాక తప్పదు.
బీజేపీ పట్టించుకుంటుందా.. ఆ పార్టీలో చేరితే పరిస్థితి ఏమిటి?
తమిళనాడుపై ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో పన్నీర్ ఎపిసోడ్ కు ఊతం అందించిన బీజేపీ.. ఇప్పుడు ఆయనను ఆదుకుంటుందా అన్నది కీలకంగా మారింది. ఎంతగా ప్రయత్నించినా అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలను చీల్చలేకపోయిన పన్నీర్ ను బీజేపీ అధిష్ఠానం అసమర్థుడిగా భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందువల్ల ఆయనకు పెద్దగా ప్రాధాన్యమిచ్చే అవకాశాలూ కనబడడం లేదు. మొత్తంగా తమిళనాట తాము అడుగిడడానికి పన్నీర్ ను పావుగా వాడుకునే ప్రయత్నం చేసిన బీజేపీ.. ఇప్పుడాయనను వదిలించుకునే ప్రయత్నమే చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ పన్నీర్ అమ్మ (జయలలిత) పేరిట కొత్త పార్టీ పెడితే మాత్రం.. బీజేపీ వీలైనంత సహకారం అందించడం, పొత్తు పెట్టుకోవడం వంటివి చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజల్లో బోలడెంత మద్దతు.. కొత్తగా ‘అమ్మ’ పార్టీ?
అన్నాడీఎంకే పార్టీలో, ఎమ్మెల్యేలలో పెద్దగా బలం లేకున్నా.. పన్నీర్ కు ప్రజల్లో మాత్రం మంచి మద్దతు ఉంది. జయలలిత రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అప్పగించినప్పుడుగానీ, ఆమె మరణం తర్వాత బాధ్యతలు స్వీకరించినప్పుడుగానీ పన్నీర్ సెల్వం పరిపాలన తీరుపై అభినందనలు వచ్చాయి. చెన్నై తుపాను, జల్లికట్టు ఉద్యమం వంటి కీలక సమయాల్లో సమర్థవంతంగా వ్యవహరించారనే పేరు పొందారు. ఇది ఆయనకు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇటీవలి పరిణామాల మధ్య సోషల్ మీడియాలో కూడా పన్నీర్ కు విపరీతమైన మద్దతు లభించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం ‘అమ్మ’ (జయలలిత) పేరిట కొత్త పార్టీ పెట్టి.. ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. జయలలితకు వీర విధేయుడిగా పేరు పొందిన ఆయన అన్నాడీఎంకేను చీల్చేందుకు ఈ ఎత్తుగడ వేయవచ్చు. మరోవైపు పళనిస్వామి శాసనసభలో బలం నిరూపించుకోలేకపోతే.. రాష్ట్రపతి పాలన విధించడం ఖాయం. తర్వాత అసెంబ్లీని రద్దు చేయడమో, కొంతకాలం సుప్తచేతనావస్థలో ఉంచి తర్వాత మరెవరికైనా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వడమో జరుగుతుంది. ఎలాగూ పన్నీర్ సెల్వానికి కేంద్రం, గవర్నర్ అండ ఉన్న నేపథ్యంలో.. శాసనసభ రద్దుకే మొగ్గు చూపవచ్చు. అదే జరిగితే ప్రజల్లో మద్దతున్న పన్నీర్ సెల్వం ‘అమ్మ’ పార్టీతో ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జయలలిత మేనకోడలు దీప ఈయన పక్షాన నిలబడడం ఎన్నికల్లో పెద్ద ప్రయోజనాన్ని కల్పిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి వస్తే ప్రస్తుతం శశికళ వర్గంలో ఉన్న నేతలు చాలా మంది పన్నీర్ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పన్నీర్ తో డీఎంకేకు లాభం
పన్నీర్ అన్నాడీఎంకేను చీల్చి కొత్త పార్టీ పెడితే అంతిమంగా డీఎంకేకు లాభమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎంజీఆర్ మరణించిన సమయంలో ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ ఒక వర్గంగా.. జయలలిత ఆధ్వర్యంలో మరో వర్గంగా అన్నాడీఎంకే చీలిపోయింది. జానకీ రామచంద్రన్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో.. మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే రెండు వర్గాలు విడివిడిగా పోటీ చేయడంతో.. డీఎంకే మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా పన్నీర్ సెల్వం కొత్త పార్టీ పెడితే దాదాపుగా అటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమైనా, అన్నా డీఎంకేను శశికళ కబంధ హస్తాల నుంచి రక్షిస్తానంటూ తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం కృషి బూడిదలో పోసిన పన్నీరేనా? లేక ముందు ముందు గుబాళిస్తుందా? అన్నది వేచి చూడాలి. ఇప్పటికైతే మాత్రం పన్నీర్ సెల్వంపై శశికళదే పైచేయి అనే చెప్పాలి!        

  • Loading...

More Telugu News