dhanush: 'విఐపి 2' వెనుకబడిపోవడానికి కారణం అదేనా?
ధనుష్ నిర్మాతగా .. కథానాయకుడిగా తమిళంలో 'విఐపి 2' సినిమా చేశాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని ఆయన అనుకున్నాడు. కుదరకపోవడంతో ఈ నెల 11న తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేసిన ఆయన, తెలుగులో నిన్న విడుదల చేశాడు. అయితే ఈ సినిమా 'విఐపి' స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది.
తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రెయిట్ మూవీగానే దీనిని ధనుష్ రూపొందించాడు. కానీ ఆ విషయాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరవేయడంలో ధనుష్ సక్సెస్ కాలేకపోయాడు. దాంతో అంతా ఈ సినిమాను అనువాద చిత్రమనే అనుకున్నారు. ఇక గతంలో వచ్చిన 'విఐపి' .. తెలుగు ప్రేక్షకులను 'రఘువరన్ బీటెక్' పేరుతో పలకరించి సక్సెస్ అయింది. అందువలన ఈ సీక్వెల్ ను 'రఘువరన్ బీటెక్ 2' గానే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావలసింది. 'రఘువరన్ బీటెక్' సినిమాకి 'విఐపి 2' సీక్వెల్ అనే సంగతి చాలామందికి తెలియకపోవడమే ఈ సినిమా వసూళ్ల పరంగా వెనుకబడటానికి కారణంగా చెప్పుకుంటున్నారు.