gurmeet: మరో రెండు హత్య కేసుల్లో నేడు గుర్మీత్ విచారణ, సిర్సా లో తీవ్ర ఉద్రిక్తత!
- విచారణ జరపనున్న పంచకుల కోర్టు
- పోలీసుల అధీనంలో కోర్టు ప్రాంగణం
- సిర్సా, పంచకుల, రోహ్ తక్ లలో భారీ బందోబస్తు
- రేప్ కేసులో 20 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్
హర్యానా, సిర్సాలోని డేరా సచ్చా సౌధాలో గతంలో జరిగిన రెండు హత్య కేసుల గురించి డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను నేడు కోర్టు విచారించనుండటంతో ఈ ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుర్మీత్ అనుచరులు విధ్వంసకాండకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో సిర్సా, పంచకుల తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుర్మీత్ ఉన్న జైలు పరిసరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేశారు. పంచకుల కోర్టు ఆవరణను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో గుర్మీత్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆపై డేరాలో అధికారులు సోదాలు జరుపగా, పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుర్మీత్ విలాసవంతమైన జీవితం, అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గాలు, ఆస్థి పంజరాలు, కట్టల కొద్దీ రద్దయిన నోట్లు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలు వంటివెన్నో లభించాయి. అధికారులు వీటన్నింటినీ మదింపు చేస్తున్నారు.