Astra BVRAAM: భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక క్షిపణి.. చివరి పరీక్ష విజయవంతం!
- అభివృద్ధి చేసిన డీఆర్డీవో
- త్వరలోనే వాయుసేనలోకి..
- శాస్త్రవేత్తలను అభినందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
భారత రక్షణ వ్యవస్థ మరింత బలంగా తయారుకానుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ (బీవీఆర్ఏఏఎం) 'అస్త్ర' చివరి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గత నాలుగు రోజులుగా వరుసగా నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. దీంతో ఈ క్షిపణి అభివృద్ధి దశ పూర్తయినట్టే.
బంగాళాఖాతం మీదుగా నిర్వహించిన అస్త్ర బీవీఆర్ఏఏఎం విజయవంతమైనట్టు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెప్టెంబరు 11 నుంచి 14 వరకు చాందీపూర్‌లో వరుసగా ఏడు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. అతి త్వరలోనే ఈ క్షిపణులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశపెట్టనున్నట్టు వివరించింది.
భారత వాయుసేన సహకారంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. అస్త్ర పరీక్ష విజయవంతం అయినందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డీఆర్డీఓ, వాయుసేన అధికారులను అభినందించారు. ఎయిర్ టు ఎయిర్, సర్ఫేర్ టు ఎయిర్ క్షిపణులను మరిన్ని అభివృద్ధి చేస్తామని డీఆర్డీఓ మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జి.సతీష్ రెడ్డి తెలిపారు.