chiranjeevi: చిరంజీవి మనసు కూడా మారుతుందని భావించా.. అందుకే ఆయనతో కలసి ముందుకు సాగలేదు!: వైసీసీ నేత వాసిరెడ్డి పద్మ
- చిరంజీవి మంచి వ్యక్తి
- ప్రజారాజ్యంలో నన్ను కోవర్ట్ గా చూశారు
- భారీ ఇమేజ్ ను అనుకూలంగా మలుచుకోవడంలో చిరంజీవి విఫలం
- ప్రజారాజ్యం వల్ల ఎంతో మంది నష్టపోయారు
మెగాస్టార్ చిరంజీవి గురించి వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏ రకంగా చూసినా చిరంజీవి అత్యున్నతమైన వ్యక్తి అని అన్నారు. చిరంజీవి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వ్యక్తులని, ఎవరికీ హాని కలిగించే వ్యక్తిత్వం వారిలో లేదని తెలిపారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చిందని... దీంతో, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా కీలక నేతలు ప్రజారాజ్యంలో చేరిపోయారని చెప్పారు. అయితే, మెగాస్టార్ గా తనకున్న భారీ ప్రజాభిమానాన్ని, రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చిరంజీవి విఫలమయ్యారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి డీఫేమ్ అయ్యారేమో అనేది తన భావన అని చెప్పారు. రాజ్యసభ ఎంపీ పదవి, కేంద్ర మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని పెట్టాల్సిన అవసరం చిరంజీవికి లేదని అన్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్ల ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
ప్రజారాజ్యంలో తనకు ఎంతో గౌరవం లభించిందని చెప్పిన పద్మ... ఆ పార్టీలో తనను కొంత మంది నేతలు టీడీపీ కోవర్ట్ గా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం ఆధారంగా వారు ఈ విధంగా అనుమానపడ్డారని చెప్పారు. అయితే, చిరంజీవి గారు మాత్రం తనను ఎన్నడూ అలా చూడలేదని తెలిపారు. కానీ, ఏదో ఒక రోజు చిరంజీవి కూడా ప్రభావితం అవుతారేమోననే భావం తనలో ఉండేదని... ఈ కారణం వల్లనే కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనమైనప్పుడు తాను చిరంజీవి గారితో కలసి వెళ్లలేదని చెప్పారు.