security: ప్రత్యేక భద్రత పొందుతున్న ప్రముఖుల సంఖ్య తగ్గించనున్న కేంద్ర ప్రభుత్వం
- ప్రస్తుతం 475 మందికి భద్రత కల్పిస్తున్న హోం శాఖ
- వీరిలో మంత్రుల పిల్లలు, మతగురువులు
- కాంగ్రెస్ హయాంలో 350 మందికే ప్రత్యేక భద్రత
వీఐపీ సంస్కృతికి వ్యతిరేకం అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం దాదాపు 475 మందికి పైగా ప్రముఖులకు ఎన్ఎస్జీ, పారామిలటరీ బలగాలతో ప్రత్యేక భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 475 మంది సంఖ్యను త్వరలో కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. రాజకీయ నాయకులు, వారి పిల్లలు, మత గురువులు ఉన్న ఈ జాబితాలో మార్పులు చేయడం ద్వారా ఎన్ఎస్జీ, పారామిలటరీ రెండు బలగాల ద్వారా భద్రత పొందుతున్న కొంతమంది ప్రముఖులకు ఎన్ఎస్జీ భద్రతను తొలగించే అవకాశం కనిపిస్తోంది.
ఉదాహరణకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎన్ఎస్జీ, పారామిలటరీ బలగాలు రెండూ భద్రతను అందిస్తున్నాయి. దీంతో ఆయనకు ఎన్ఎస్జీ భద్రత తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండని అఖిలేశ్ యాదవ్, రమణ్ సింగ్, కరుణానిధి వంటి నేతలకు కూడా భద్రతను తగ్గించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరికీ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అలాగే యోగా గురువు బాబా రాందేవ్‌కు 30 మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది భద్రతగా ఉంటారు. ఆయనతో పాటు మాతా అమృతానందమయికి జెడ్ కేటగిరీ, రామజన్మభూమి బోర్డు ఛైర్మన్ మహంత్ నిత్యగోపాల్ దాస్‌తో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేత సాక్షి మహరాజ్‌కు వై కేటగిరీ భద్రత ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువమంది వీఐపీలకు ప్రత్యేక భద్రత ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం ములాయం సింగ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి ప్రత్యేక భద్రతను కేటాయించారు. వీరితో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి జెడ్ కేటగిరీ భద్రత ఉండగా.. ఆయన సతీమణి నీతా అంబానీకి వై కేటగిరీ భద్రత కల్పించారు. గత యూపీఏ ప్రభుత్వం కేవలం 350 మందికి మాత్రమే వీఐపీల కింద భద్రతను కేటాయించింది. వీరిలో జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వారు కేవలం 26 మంది మాత్రమే.