video viral: తరగతి గదిలో విచిత్ర లెక్కలు చెప్పి విమర్శలు ఎదుర్కుంటోన్న ఉత్తరాఖండ్ మంత్రివర్యులు.. వీడియో వైరల్!
- టీచర్‌కే పరీక్ష పెట్టిన ఉత్తరాఖండ్ విద్యా శాఖ మంత్రి
- తనకు కూడా సైన్స్ తెలుసని వాదన
- గణితం, రసాయన శాస్త్రం లెక్కలు అంటూ తిక్క ప్రశ్నలు
- న్యూస్ ఛానెళ్లలో రావడంతో సమర్థించుకున్న వైనం
ఉత్తరాఖండ్ విద్యా శాఖ మంత్రి అరవింద్ పాండే ఆకస్మిక తనిఖీల పేరుతో ఓ తరగతిలోకి వెళ్లి, తానే టీచర్‌కి పాఠాలు చెప్పి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అందుకు కారణం ఆయనకు టీచర్‌కి తప్పుడు లెక్కలు చెప్పడమే. టీచర్‌కే పాఠాలు చెబుతూ ఆయన ప్రదర్శించిన తీరుకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
డెహ్రాడూన్‌లోని మహిళా ఇంటర్ కాలేజీలో ఓ క్లాస్‌రూమ్‌లోకి వచ్చి కుర్చీలో కాలుపై కాలు వేసుకుని కూర్చొని ఆ మంత్రి టీచర్‌కు పరీక్ష పెట్టారు. గణిత శాస్త్రంలో ప్రాథమిక సూత్రాలను అడిగారు. మొదట మైనస్ ప్లస్ మైనస్ ఎంత? అని అడిగారు. దానికి ఆ టీచర్ ‘మైనస్’ అని సమాధానం చెప్పారు. అయితే, ఆ సదరు మంత్రి మాత్రం సరైన సమాధానం ‘ప్లస్’ అని వ్యాఖ్యానించారు. తనకు కూడా సైన్స్ తెలుసని, తానూ చదువుకున్నానని వాదన చేశారు.
గణితశాస్త్రంలో తన ప్రశ్నకి సమాధానం ప్లస్ అని, రసాయన శాస్త్రంలో మాత్రం మైనస్ అని ఆయన కొత్త లెక్కలు చెప్పారు. అంతేకాదు, ఇటువంటి తిక్క ప్రశ్నలే మరిన్ని వేసి ఆ టీచర్ని విసిగించారు. ఏమీరాదంటూ తరగతి గదిలో టీచర్ని వేలెత్తి చూపిస్తూ ఆమెను అవమానించారు. ఇందుకు సంబంధించిన వీడియో న్యూస్ ఛానెళ్లలోనూ రావడంతో ఆ మంత్రి స్పందిస్తూ.. టీచర్ ప్రభుత్వ పుస్తకాలు కాకుండా గైడ్లు వాడుతోందని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.