BJP President: తియ్.. నాలుగు తరాల లెక్కలు తియ్!.. రాహుల్‌ను టార్గెట్ చేసిన అమిత్ షా!
- రాహుల్ బాబా బాగా మాట్లాడుతున్నారు
- ముందు ఆ లెక్కలు బయటపెట్టాలి
- జార్ఖండ్ సీఎంపై షా ప్రశంసల జల్లు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లో నిర్వహించిన ‘గరీబ్ కల్యాణ మేలా’లో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘రాహుల్ బాబా అమెరికాలో చాలా మాట్లాడుతున్నారు. అయితే ముందు ఆయన కొన్ని లెక్కలు బయటకు తీయాలి. దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించిన నెహ్రూ-గాంధీ రాజకీయ కుటుంబానికి చెందిన నాలుగు తరాల లెక్కలు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు అమిత్ షా పేర్కొన్నారు. జార్ఖండ్ అభివృద్ధికి మోదీ అండగా ఉన్నారని, ఆయన రాయిలా నిలబడ్డారని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌ను కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అమిత్ షా ప్రశంసించారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందుతోందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ తర్వాతి స్థానంలో జార్ఖండే ఉందని, 8.6 శాతం అభివృద్ధి రేటుతో రెండోస్థానంలో నిలిచిందని వివరించారు.