honeypreet: నేపాల్ కు పారిపోయిన హనీ ప్రీత్... కీలక ఆధారం దొరకడంతో కదిలిన ప్రత్యేక బృందాలు
- హనీప్రీత్ ఆచూకీ చెప్పిన ఉదయ్ పూర్ డేరా ఇన్ చార్జ్
- పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
- త్వరలోనే హనీప్రీత్ ను అరెస్ట్ చేస్తామంటున్న పోలీసులు
హర్యానాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలుశిక్ష పడిన తరువాత జరిగిన విధ్వంసం కేసులో కీలక నిందితురాలిగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు భావిస్తున్న హనీప్రీత్ సింగ్, నేపాల్ కు పారిపోయినట్టు గట్టి ఆధారం లభించింది. ఆమె ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్టు తెలుసుకున్న అధికారులు, ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు.
సిర్సా డేరాకు అనుబంధంగా ఉదయ్ పూర్ లో నడుస్తున్న డేరా ఆశ్రమ ఇన్ చార్జ్ ప్రదీప్ గోయల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని విచారించి హనీప్రీత్ ఎక్కడుందన్న విషయాన్ని కూపీ లాగారని తెలుస్తోంది. ఆమె ఆచూకీపై ప్రదీప్ నుంచి స్పష్టమైన సమాచారం లభించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలో హనీప్రీత్ ను అదుపులోకి తీసుకుని ఇండియాకు తీసుకు వస్తామని ఈ సందర్భంగా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నేపాల్, భారత్ సరిహద్దుల్లోని ఏడు జిల్లాల్లో ఆమె ఎక్కడుందన్న విషయం ఇంకా తెలియరాలేదని అన్నారు.