kvp: దర్శకుడు రాజమౌళి నేతృత్వంలో డిజైన్లు రూపొందించాలా? ఇది చంద్రబాబు కుటిల రాజకీయ ధోరణి: కేవీపీ ధ్వజం
- ఇప్పటికీ రాజధాని ప్రాంత నిర్మాణానికి డిజైన్లు లేవు
- చంద్రబాబు నాయుడు కావాలనే తాత్సారం చేస్తున్నారు
- పనులు పూర్తి చేయడానికి మరోసారి అధికారం ఇవ్వాలని మభ్యపెడుతున్నారు
- నార్మన్‌ఫాస్టర్ డిజైన్లు బాగోలేవన్నారు.. జపాన్ సంస్థ మకీని వద్దన్నారు
- ఇప్పుడు రాజమౌళి కావాలని అంటున్నారు
ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన పనుల్ని సత్వరం పూర్తి చేయకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే తాత్సారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మరోసారి అధికారం ఇవ్వాలని, ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకునే ఎత్తుగడల్లో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు అంతర్జాతీయంగా పేరొందిన నార్మన్‌ఫాస్టర్ రూపొందించిన రాజధాని డిజైన్లను తిరస్కరించారని అన్నారు.
రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన రాజధాని డిజైన్ల ఎంపిక ప్రక్రియను ఇప్పటికీ పూర్తి చేయకుండా జాప్యం చేయడం రాజకీయం చేయడమేనని కేవీపీ అన్నారు. ఇప్పటికే పలుసార్లు మార్పులు చేసిన నార్మన్‌ఫాస్టర్ డిజైన్లు బాగోలేదని తిరస్కరించి, అంతిమంగా సినిమా దర్శకుడు రాజమౌళి నేతృత్వంలో డిజైన్లను రూపొందించాలని ఆదేశించడం చంద్రబాబు కుటిల రాజకీయ ఆలోచన ధోరణికి అద్దం పడుతోందని విమర్శించారు. అంతకుముందు 'అద్భుతం అమోఘం' అంటూ పొగిడిన జపాన్ ఆర్కిటెక్ట్ సంస్థ మకీని ఏకపక్షంగా పక్కకు తప్పించిన చంద్రబాబు... ఇప్పుడు నార్మన్ ఫాస్టర్ డిజైన్లను కూడా పక్కకు తప్పించి తనకు రాజమౌళి కావాలంటున్నాడని కేవీపీ ఎద్దేవా చేశారు.
రైల్వే మంత్రికి కేవీపీ లేఖ
రైల్వే ట్రాక్‌ల భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఎంపీ కేవీపీ రామ చంద్రరావు లేఖ రాశారు. జీఎస్టీ 18 శాతానికి పెంచడం వల్ల దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.585 కోట్ల మరమ్మతు పనులు నిలిచిపోయాయని అన్నారు. సమస్యను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.