child abuse: పిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో అవగాహన కల్పించే ప్రయత్నం.. పాఠ్య పుస్తకాల్లో సూచనలు!
- ఎన్సీఈఆర్టీ నిర్ణయం
- ర్యాన్ స్కూల్ హత్య నేపథ్యం
- హెల్ప్‌లైన్ నెంబర్లు, బాలల హక్కుల గురించి వివరణ
చిన్నపిల్లలపై లైంగికపర వేధింపులకు సంబంధించిన సంఘటనలు పెరుగుతున్న కారణంగా పాఠ్యపుస్తకాల్లో లైంగిక దాడులకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు పొందుపరచనున్నారు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి లైంగిక దాడుల గురించి పిల్లల్లో అవగాహన పెంచేందుకు సూచనలు, లైంగిక దాడి జరిగే విధానాలు, జాగ్రత్తలతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు, లైంగిక దాడి నేరాలకు సంబంధించిన చట్టాల వివరాలను కూడా పాఠ్యపుస్తకాల్లో ప్రచురించనున్నట్లు ఎన్సీఈఆర్టీ పేర్కొంది.
దీని వల్ల పిల్లలకు సభ్య స్పర్శ, అసభ్య స్పర్శల మధ్య తేడాలు తెలుస్తాయని, అలాగే లైంగిక దాడి సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి కూడా తెలుస్తుందని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. ర్యాన్ స్కూల్లో విద్యార్థి హత్య సంఘటన తర్వాత చైల్డ్ అబ్యూస్‌కి సంబంధించిన అంశాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తమకు సూచించినట్లు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ హృషీకేష్ సేనాపతి తెలిపారు. ఈ విషయాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆయన కోరారు.