rohingya muslims: రోహింగ్యా ముస్లింలకు మద్దతు పలికిన బీజేపీ నాయకురాలిపై వేటు!
- రోహింగ్యాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు
- కన్నెర్ర చేసిన రాష్ట్ర నాయకత్వం
- వివరణ కూడా అడక్కుండానే సస్సెండ్ చేశారంటూ వాపోయిన నాయకురాలు
సైనిక చర్యకు భయపడి, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని, లక్షలాది రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుంచి పొరుగు దేశాలకు వలస వెళుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలోకి కూడా భారీ సంఖ్యలో రోహింగ్యాలు వచ్చారు. హైదరాబాదులో సైతం వందలాది మంది రోహింగ్యాలు తలదాచుకున్నారు. ఈ క్రమంలో, అసోం రాష్ట్ర బీజేపీ నాయకురాలు బేనజీర్ రోహింగ్యాలకు మద్దతు పలికారు.
ఓ స్వచ్చంద సంస్థ గౌహతిలో రోహింగ్యాల కోసం ప్రార్థనా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బేనజీర్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత సమావేశం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... 'నిరసన సమావేశం' అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం మండిపడింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా బేనజీర్ మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విషయంతో తాను ప్రధాని మోదీకి మద్దతు పలికానని... అలాంటి తనను కనీసం వివరణ కూడా అడక్కుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వాపోయారు.