america: ఉత్తరకొరియాను నేరుగా రెచ్చగొట్టిన అమెరికా యుద్ధవిమానాలు
- ద్వీపకల్పం మీదుగా ఎగిరిన అమెరికా యుద్ధ విమానాలు
- సాధారణ మాక్ డ్రిల్ అంటూ ప్రకటించిన దక్షిణకొరియా
- మరిన్ని విన్యాసాలు చేస్తామంటూ ప్రకటన
- దక్షిణ కొరియాలో పాగా వేసిన అమెరికా సైన్యం
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నప్పటికీ అణుక్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ సరిహద్దు సముద్ర జలాల్లో పడేలా క్షిపణి పరీక్షలు నిర్వహించి, తామెవరికీ భయపడమని పరోక్ష ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరకొరియాను నేరుగా రెచ్చగొట్టేందుకు అమెరికా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. దక్షిణ కొరియా-ఉత్తరకొరియా మధ్యనున్న పెనిన్సులా మీదుగా ఆరు యుద్ధవిమానాలను అమెరికా నడిపింది.
ఇందులో దక్షిణ కొరియాకు చెందిన నాలుగు ఎఫ్-15 యుద్ధ విమానాలతోపాటు అమెరికా మిలటరీకి చెందిన నాలుగు ఎఫ్-35బీ యుద్ధ విమానాలు, రెండు బీ-1బీ బాంబర్స్ సంయుక్తంగా దూసుకెళ్లాయని దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. మాక్ డ్రిల్ లో భాగంగా ఈ విన్యాసం చేసినట్టు వెల్లడించింది. ఇలాంటి మాక్ డ్రిల్స్ చాలా చేస్తామని దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించినా యుద్ధం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉత్తరకొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న అమెరికా ఇప్పటికే 28,000 మంది సైనికులను దక్షిణకొరియా సరిహద్దుల్లో మోహరించిన సంగతి తెలిసిందే.